ఇండియాబుల్స్‌‌లో 98 వేల కోట్ల హైజాక్​

  • 8.5 శాతం పడిపోయిన షేర్లు
  • నిధుల మళ్లించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
  • ప్రజల సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణలు

నాన్ బ్యాంక్ ఫైనాన్సింగ్ కంపెనీల్లో మరో సంస్థ కూడా వార్తలోకెక్కింది. ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఐబీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్) కంపెనీలో రూ.98 వేల కోట్ల నిధులు దారి మళ్లాయని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌‌ను ఇండియాబుల్స్ కొట్టిపారేస్తోంది. కంపెనీ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికే సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ దాఖలైందని, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌‌తో విలీనమవుతున్న ఈ క్రమంలో ఆందోళనలు సృష్టిస్తున్నారని ఇండియాబుల్స్‌‌ స్పష్టం చేసింది.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో రోజుకో వివాదం బయటికి వస్తోంది. ఇండియాబుల్స్‌‌లో నిధుల దారి మళ్లింపు జరిగిందంటూ అభయ్ యాదవ్ అనే వ్యక్తి సోమవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌‌ను దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌‌‌‌లో రూ.98 వేల కోట్ల ప్రజల సొమ్మును దారి మళ్లించారని ఆరోపిస్తూ.. ఇండియాబుల్స్‌‌‌‌ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌‌‌‌పై, దాని ఛైర్మన్‌‌‌‌ సమీర్ గెహ్లాట్‌‌‌‌పై, డైరెక్టర్లపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. గెహ్లాట్, సంస్థ డైరెక్టర్లు కలిసి ఈ సొమ్మును తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని పేర్కొన్నాడు. గెహ్లాట్‌‌‌‌, నాన్‌‌‌‌ రెసిడెంట్ ఇండియన్‌‌‌‌ అయిన హరీష్ ఫబియానితో కలిసి పలు షెల్ కంపెనీలను సృష్టించారని పిటిషనర్ పేర్కొన్నాడు. ఈ షెల్ కంపెనీలకు పెద్ద మొత్తంలో ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ రుణాలిచ్చిందని తెలిపాడు. ఆ తర్వాత ఈ రుణాలను గెహ్లాట్, ఆయన కుటుంబ సభ్యులు, ఇండియాబుల్స్ డైరెక్టర్లు నడిపే సంస్థలకు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసినట్టు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ఈ మొత్తం స్కాం ఆడిటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, సంబంధిత ప్రభుత్వ డిపార్ట్‌‌‌‌మెంట్ల అధికారులను ఒప్పించనిదే సాధ్యం కాదని కూడా ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. దారి మళ్లించిన ఇన్వెస్టర్ల మనీని రక్షించేందుకు, పునరుద్ధరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని, సెబీని, ఆర్​బీఐని, ఐటీశాఖను ఆదేశించాలని ఫిర్యాదుదారుడు కోరాడు. గెహ్లాట్​కు ఎంతో పలుకుబడి ఉందని ఆరోపించాడు. ఆయనకు రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్నాయన్నాడు. ఇన్వెస్టర్ల మనీతో దేశం విడిచి చెక్కేయాలని చూశాడని కూడా అభయ్​ ఆరోపించాడు.

షెల్ కంపెనీ కోసం రూ.1700 కోట్లు…

దీని కోసం గెహ్లాట్, ఇతర కుట్రదారులు ఒక ప్రత్యేక పద్ధతిని ఎంచుకున్నారని, పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్ల నగదుకే కాక, ప్రభుత్వ ఖజానాకు కూడా భారీ మొత్తంలో  గండి కొట్టారని ఆరోపిస్తున్నాడు.  ఈ మోసానికి పాల్పడేందుకు,  ఆర్థిక చట్టాలను ఉల్లంఘించేందుకు సైతం వారు వెనుకడుగు వేయలేదన్నాడు. స్టేక్‌‌‌‌హోల్డర్స్, ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌‌‌లు, ప్రైవేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ల మనీతో ఈ స్కామ్‌‌‌‌కు తెరతీశారని ఆరోపించారు.  గెహ్లాట్, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ విధానాలకు ప్రజల డబ్బును వాడుకున్నారని విమర్శించాడు.  రెగ్యులేటరీ అథారిటీలను కూడా గెహ్లాట్, ఆయన భార్య తప్పుదోవ పట్టించారని ఆరోపించాడు. షెల్ కంపెనీలు సృష్టించడానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సుమారు.1,700 కోట్లు వాడుకున్నా రని ఫిర్యాదులో తెలిపాడు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అవి అక్రమమని పేర్కొన్నాడు. ఢిల్లీ, ముంబై, గుర్గావ్ ప్రాంతాల్లోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఇండియాబుల్స్ డైరెక్టర్లు, ప్రమోటర్లు, లబ్దిదారులు ఇంటర్‌‌‌‌‌‌‌‌కనెక్ట్ అయ్యారన్నాడు.

మొత్తం రుణాలే రూ.90 వేల కోట్లు…

అయితే ఈ ఆరోపణలన్నింటిన్నీ ఇండియాబుల్స్ కంపెనీ కొట్టిపారేస్తోంది. ‘రిట్ పిటిషన్ దాఖలైంది సోమవారం రోజు. ఇంకా దానిపై కోర్టు విచారణ చేపట్టలేదు. ఇండియా బుల్స్ హౌజింగ్ బుక్స్‌‌‌‌లోని మొత్తం రుణాలే సుమారు రూ.90 వేల కోట్లు ఉంటాయి. అలాంటిది రూ.98 వేల కోట్ల దారి మళ్లింపు జరిగాయని ఆరోపణలు రావడం విడ్డూరం’ అని ఐబీహెచ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎల్ తన ప్రకటనలో పేర్కొంది. కంపెనీ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికే ఈ రిట్ పిటిషన్‌‌‌‌ను దాఖలు చేశారని కంపెనీ పేర్కొంటోంది. రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఫిర్యాదుదారుడు నెల క్రితమే కంపెనీకి చెందిన నాలుగు షేర్లను కొన్నాడని ఐబీహెచ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎల్ తెలిపింది. లక్ష్మీ విలాస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌తో తాము విలీనం కావడానికి రెగ్యులేటరీ ఆమోదం కోసం చూస్తోన్న క్రమంలో  ఈ రిట్ పిటిషన్‌‌‌‌ను దాఖలు చేశారని కంపెనీ వాపోయింది.

ఆరోపణలతో షేర్లకు నష్టాలు…

ఈ నేపథ్యంలో ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ షేర్లు స్టాక్ మార్కెట్‌‌‌‌లో బాగా పడిపోయాయి. మంగళవారం ఇంట్రాడేలో ఇండియాబుల్స్ షేర్లు 8.5 శాతం మేర తగ్గాయి. బీఎస్‌‌‌‌ఈలో 8.32 శాతం నష్టపోయిన కంపెనీ షేర్లు రూ.672.05గా నమోదయ్యాయి. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో కూడా షేర్లు 8.46 శాతం పతనమై, రూ.671.25 వద్ద ట్రేడయ్యాయి. చివరికి ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో 8.07 శాతం నష్టంలో రూ.674.15 వద్ద క్లోజయ్యాయి.

Latest Updates