కావాలంటే నన్ను చంపండి: మమత

plot-to-tarnish-bengals-image-underway-bengal-is-not-gujarat-mamata
  • బీజేపీ హత్యారాజకీయాలు సాగనివ్వం
  • వేడుకలా విద్యాసాగర్ విగ్రహ పున:ప్రతిష్ట
  • అల్లర్ల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

కోల్​కతా: వెస్ట్​బెంగాల్​లో హత్యా రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. రాష్ట్రాన్ని గుజరాత్​లా మార్చాలనుకుంటున్నదని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ ఆటలు సాగనివ్వబోనన్న ఆమె, బెంగాల్​ కల్చర్​ను కాపాడుకునే పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసిరావాలని పిలుపిచ్చారు. మంగళవారం కోల్​కతాలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో ఆమె,  బెంగాల్​ సంఘసంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని మంగళవారం తిరిగి ప్రతిష్టించారు. నెల రోజుల కిందట కోల్​కతాలో బీజేపీ చీఫ్​ అమిత్​ షా ర్యాలీ సందర్భంగా జరిగిన గొడవల్లో విద్యాసాగర్​ కాలేజీలోని విగ్రహం ధ్వంసమైన సంగతి తెలిసిందే. మమత నాయకత్వంలో వందలమంది రచయితలు, ప్రొఫెసర్లు, సెలబ్రిటీలు, తృణమూల్​ కార్యకర్తలు వెంటరాగా, కొత్త విగ్రహాన్ని ఓపెన్​టాప్​ జీపులో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అదే కాలేజ్​ ప్రాంగణంలో 8.5 అడుగుల విద్యాసాగర్​ నిలువెత్తు కొత్త విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. ఆ తర్వాత సభనుద్దేశించి మాట్లాడుతూ, పార్టీలతో సంబంధం లేకుండా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

‘‘వేరే రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హింస జరిగింది. కానీ ఆ వార్తల్ని బయటికి రానీయకుండా బీజేపీ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. బెంగాల్​ను డీఫేమ్​ చేయడానికే ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా హైలైట్​ చేసి చూపిస్తున్నారు. కల్చర్​ని దెబ్బతీయడానికి బీజేపీ పన్నిన కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. బెంగాల్​ని గుజరాత్​లా మార్చాలనుకుంటున్న బీజేపీ కల నెరవేరదు. కావాలంటే నన్ను చంపండి. బెంగాల్​ ప్రజల క్షేమం తప్ప నాకు ఏదీ అక్కర్లేదు. ఇక్కడ హత్యలు జరగడం దురదృష్టకరం. చనిపోయింది బీజేపీ వాళ్లా, టీఎంసీ కార్యకర్తలా అని చూడం. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం అందిస్తాం’’అని సీఎం మమత తెలిపారు.

బెంగాల్‌లో ఆగని గొడవలు

  • బాంబు దాడిలో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు మృతి
  • బీజేపీ పనేనన్న టీఎంసీ
  • ఖండించిన కమలం నేతలు

బ్యారక్ పూర్‌ (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య గొడవలు ఆగడం లేదు. నార్త్‌ 24 పరగణ జిల్లాలోని కంకినరలో సోమవారం అర్ధరాత్రి జరిగిన బాంబు దాడిలో ఇద్దరు టీఎంసీ కార్యకర్తలు చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లాలో జరిగిన దాడిలో మరొకరు చనిపోయారు. బీజేపీ గూండాలే దాడికి పాల్పడ్డారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. కుటుంబసభ్యులతో కలిసి ఇంటి బయట కూర్చున్న వారిపై దుండగులు బాంబులతో దాడి చేశారని పోలీసులు చెప్పారు. ముగ్గురు నిందితులను అదుపులోకి  తీసుకున్నామన్నారు. దాడిలో మహ్మద్‌ ముక్తార్‌‌, మహ్మద్‌ హాలీమ్ లు చనిపోయారని పోలీసులు చెప్పారు.  టీఎంసీకి ఓట్లు వేశారనే అనుమానంతో వారిపై బీజేపీ గూండాలు  దాడి చేశారని మంత్రి జ్యోతి ప్రియ మాలిక్‌ అరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. కుటుంబ కలహాలతో ఎవరో వారిపై దాడి చేయించారని, దీంతో బీజేపీకి సంబంధం లేదని ఎంపీ అర్జున్‌ సింగ్‌ చెప్పారు. ఎన్నికల రిజల్ట్‌ వచ్చిన తర్వాత బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Latest Updates