నెరవేరిన కోట్లాది మంది కల.. రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రధాని

  • వెండి ఇటుకలతో భూమి పూజ చేసిన మోడీ
  • వీడియో ద్వారా వీక్షించిన అద్వానీ, జోషీ, అమిత్‌ షా
  • పట్టు వస్త్రాల్లో ప్రత్యేకంగా కనిపినంచిన ప్రధాని
  • హనుమాన్‌ ఆలయంలో పూజలు, పారిజాత వృక్షం నాటిన మోడీ

అయోధ్య: కోట్లాది మంది కల సాకారమైంది. ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న కార్యక్రమం పూర్తైంది. అయోధ్యలోని రామజన్మభూమిలో ఇక రామమందిరం కొలువుకానుంది. కోట్లాది మందికి బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. రామజన్మభూమిలో మందిరాన్ని నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. బుధవారం ఉదయం 12: 40 నిమిషాలకు అభిజిత్‌ లగ్నమంలో.. వెండి ఇటుకలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం క్యాంపైన్‌ మొదలు పెట్టిన బీజేపీ సీనియర్‌‌ నేతలు ఎల్‌కే. అద్వానీ, మురళీ మనోహర్‌‌ జోషీలు వీడియో ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు. కరోనా పాజిటివ్‌ వచ్చి హాస్పిటల్‌లో ఉన్న హోం మంత్రి అమిత్‌ షా కూడా హాస్పిటల్‌ బెడ్‌పై నుంచే కార్యక్రమాన్ని వీక్షించారు. 1989లో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పంపిన ఇటుకల్లో జై శ్రీరామ్‌ అని రాసిన 100 ఇటుకలను పునాది రాయి కోసం ఉపయోగించినట్లు పూజారి ఒకరు చెప్పారు. సంప్రదాయ దస్తులైన కుర్తా, ధోటీతో ప్రధాని ప్రత్యేకంగా కనిపించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని 11:30నిలకు అయోధ్యకు చేరుకోగా.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆయన స్వాగతం పలికారు. అక్కడ నుంచి హనుమాన్‌ గర్హీ ఆలయానికి చేరుకున్న మోడీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి హనుమంతుడి ఆజ్ఞను కోరేందుకు సంకేతంగా మొదట ఆంజనేయుడిని దర్శించుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ మెంబర్‌‌ అనిల్‌ మిశ్రా అన్నారు. అక్కడ నుంచి నేరుగా రామమందిర నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న మోడీ రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు చేశారు. సాష్టంగా నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటి ప్రత్యేక పూజలు చేశారు. మోడీ టూర్‌‌ సందర్భంగా అయోధ్యలో భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. అంతే కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గత మూడు రోజులుగా అయోధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామ నామస్మరణతో మోగి పోయిందని స్థానికులు చెప్పారు. మూడు రోజులుగా జరుగుతున్న ప్రత్యేక పూజలు శంకుస్థాపనతో ముగిశాయని పూజారి ఒకరు మీడియాకు చెప్పారు.

Latest Updates