‘మీకోసం ఉత్తేజకరమైన వృత్తి ఎదురుచూస్తోంది’ : సివిల్‌ సర్వీసెస్‌ ఉత్తీర్ణులకు మోడీ విషెస్‌

సివిల్ సర్వీసెస్ పరీక్ష- 2019 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులంద‌ర్నీ ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. పరీక్షలో ఉత్తీర్ణ‌త సాధించ‌లేని వారికి, జీవితం అనేక అవకాశాలతో నిండి ఉందని, వారి భవిష్యత్ ప్రయత్నాల్లో అదృష్టం క‌లిసిరావాల‌ని కోరుకుంటున్నాను తెలిపారు.

మంగ‌ళ‌వారం సివిల్ సర్వీసెస్-2019 ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది యూపీఎస్సీ. మొత్తం 829 మంది అభ్య‌ర్ధులు సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. ప్ర‌ధాని మోడీ వారంద‌ర్నీ అభినందిస్తూ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు. ప్రజా సేవ చేసేందుకు మీకోసం ఓ ఉత్తేజకరమైన, సంతృప్తికరమైన వృత్తి ఎదురుచూస్తోందని ట్వీట్ చేస్తూ.. అభ్య‌ర్ధుల‌కు త‌న‌ శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

అలాగే.. ప‌రీక్ష‌ల్లో ఆశించిన‌ ఫ‌లితం రాని యువ‌త‌కు కూడా మోడీ త‌న సందేశాన్నిచ్చారు. జీవితం అనేది ఎన్నో అవ‌కాశాల‌ను అందిస్తుంద‌ని, ప‌రీక్ష‌లు రాసిన వారిలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసేవార‌ని‌, శ్రద్ధగలవారని చెబుతూ.. వారి భవిష్యత్ ప్రయత్నాలకు త‌న‌ విషెస్ ఉంటాయ‌ని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు పీఎం .

Latest Updates