తెలంగాణ భవిష్యత్తు ఓ జ్యోతిష్యుడు నిర్ణయించాలా? : మోడీ

మహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన విజయ సంకల్ప సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శలు గుప్పించారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో స్పష్టత ఇవ్వలేకపోయారని అన్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు.

ఓ జ్యోతిష్యుడి సలహాతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని విమర్శించారు పీఎం మోడీ. తెలంగాణ భవిష్యత్తును ఓ జ్యోతిష్యుడు నిర్ణయించాలా అని ప్రశ్నించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన 3 నెలల టైమ్ తీసుకున్నారని అన్నారు. కుటుంబ ప్రయోజనాల కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ లో నేత లేడు.. నీతి లేదు…

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపైనే విమర్శలు చేశారు ప్రధానమంత్రి. టీఆర్ఎస్ – కాంగ్రెస్ రెండూ వేరు కాదన్నారు. జాతీయ కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని చెప్పారు. దేశాన్ని కాపాడుతున్న సైనికుల శక్తియుక్తులను కాంగ్రెస్ నమ్మలేకపోతోందని అన్నారు.

“60 నెలల్లో సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం. ఉగ్రవాదాన్ని కశ్మీర్ కే పరిమితం చేశాం. దేశంలో భద్రత పెంచాం. ఓటు ప్రధానికి కాదు.. ఈ దేశం బాగుకోసం వేయండి. ఈ చౌకీదార్ కు మరోసారి సేవచేసే అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి” అని మోడీ మహబూబ్ నగర్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

Latest Updates