సియోల్ శాంతి బహుమతి.. భరత జాతికి అంకితం: మోడీ

సియోల్: రెండు రోజుల పర్యటనకు దక్షిణ కొరియా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని ఆ దేశం సియోల్ శాంతి బహుమతితో సత్కరించింది. శుక్రవారం ఉదయం సియోల్ పీస్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును ఆయనకు అందజేసింది. ప్రపంచ శాంతి, గ్లోబల్ ఎకనమిక్ గ్రోత్, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం చేసిన కృషి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దీనిని ప్రదానం చేసినట్లు తెలిపింది.

భారత జాతికి అంకితం

సియోల్ శాంతి బహుమతిని భారత జాతికి అంకితం చేస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. ఇది వ్యక్తిగతంగా తనకు వచ్చింది కాదని, మొత్తం భారత ప్రజలకు సొంతం అని చెప్పారు. భారతీయుల ఆశలు, ప్రోత్సాహం, శ్రమ కేవలం ఐదేళ్లలో అద్భుతమైన విజయాలను సాధించిందని, వారి తరఫున తాను ఈ బహుమతి అందుకున్నానని అన్నారు. ఇందుకు తనకెంతో గర్వంగా ఉందని చెప్పారాయన. ఈ అవార్డుతో వచ్చిన నజరానా మొత్తం రూ.1.42 కోట్లను నమామి గంగే కార్యక్రమానికి ఇచ్చి, గంగానది స్వచ్ఛతకు కృషి చేస్తామన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకొంటున్న ఈ ఏడాదిలో సియోల్ శాంతి బహుమతి అందుకునే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు.

కొరియా రాజధాని సియోల్ లో 1988 సమ్మర్ ఒలింపిక్స్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఈ అవార్డును ప్రారంభించారు. ఆ గేమ్స్ ముగిసిన రోజు మహాత్మా గాంధీ పుట్టిన రోజే కావడం విశేషం.

Latest Updates