కలిసి కొట్లాడుదం… కరోనాపై సార్క్ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు

కరోనా వైరస్​పై పోరాడేందుకు సార్క్ (సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్) దేశాలు ఉమ్మడి వ్యూహం రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో సార్క్ సభ్య దేశాలు ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలవాలని కోరారు. కలిసి పని చేసి భూమిని ఆరోగ్యవంతమైన ప్లానెట్​గా మార్చేందుకు కృషి చేద్దామని అన్నారు. బలమైన వ్యూహాన్ని రూపొందించేందుకు ఆయా దేశాల నాయకులు కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రతిపాదించారు. మోడీ ప్రపోజల్​కు పలు దేశాల నుంచి వెంటనే స్పందన లభించింది.

వీడియో కాన్ఫరెన్స్​లో చర్చిద్దాం

‘‘బలమైన స్ర్టాటజీకి రూపకల్పన చేయాలని సార్క్ దేశాల నాయకత్వానికి నేను ప్రపోజ్ చేస్తున్నా. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం చర్చించవచ్చు. మన పౌరులు ఆరోగ్యం ఉంచేందుకు మార్గాలు వెతకొచ్చు” అని మోడీ వివరించారు. ‘‘మన గ్రహం కొవిడ్–19తో పోరాటం చేస్తోంది. కరోనాను ఎదుర్కొనేందుకు పలు స్థాయిల్లో ప్రభుత్వాలతోపాటు, ప్రజలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న సౌత్ ఆసియాలో.. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సంబంధించి ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోకూడదని అన్నారు.

మేం రెడీ

మోడీ ప్రపోజల్​పై సార్క్​లోని మెజారిటీ దేశాలు స్పందించాయి. శ్రీలంక ప్రెసిడెంట్ గోతబయ రాజపక్స, మాల్దీవుల ప్రెసిడెంట్ ఇబ్రహీం మొహమ్మద్ సోలీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్ ప్రధాని లోతయ్ షేరింగ్ తదితరులు.. ఉమ్మడి పోరు ప్రతిపాదనను స్వాగతించారు. చర్చలు జరిపేందుకు శ్రీలంక సిద్ధంగా ఉందని రాజపక్స అన్నారు.

ఎట్ల కొట్లాడుతున్నమంటే?

కరోనా వైరస్​ను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను 130 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలకు మన దేశం వివరించింది. ఇందులో 100 మంది పలు దేశాల రాయబారులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. విదేశాంగ శాఖ, ఆరోగ్య శాఖ, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ, హోం శాఖ సీనియర్ అధికారులు.. విదేశీ ప్రతినిధులకు బ్రీఫ్ చేశారు. ప్రభుత్వ సలహాదారులకు సంబంధించిన వివరణలను కూడా అందజేశారు.

‘‘గొప్ప చొరవ తీసుకున్న నరేంద్ర మోడీకి థ్యాంక్స్. డిస్కషన్​కు లంక సిద్ధంగా ఉంది. మేం చేపట్టిన చర్యల గురించి వివరించేందుకు, సార్క్ దేశాల నుంచి నేర్చుకునేందుకు మేం రెడీ. ఇలాంటి సమయాల్లో ఐక్యంగా ఉందాం’’

– శ్రీలంక ప్రెసిడెంట్ గోతబయ రాజపక్స

‘‘మోడీజీ ఐడియాను స్వాగతిస్తున్నా. ప్రాణాంతక వైరస్ నుంచి మన పౌరులను రక్షించుకునేందుకు సార్క్ దేశాలతో కలిసి పని యడానికి మా ప్రభుత్వం రెడీ’’

– నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ

‘‘ప్రస్తుత పరిస్థితిలో ఇలాంటి ముఖ్యమైన చొరవ తీసుకున్నందుకు పీఎం మోడీకి ధన్యవాదాలు. కొవిడ్–19ను ఓడించడానికి సమష్టి కృషి అవసరం. మోడీ ప్రతిపాదనను మాల్దీవులు స్వాగతిస్తున్నాయి’’

– మాల్దీవుల ప్రెసిడెంట్  ఇబ్రహీం మొహమ్మద్ సోలీ

‘‘ఇది కదా నాయకత్వం అంటే. ఈ ప్రాంత సభ్యులుగా మనం ప్రస్తుత పరిస్థితుల్లో కలిసి రావాలి. చిన్న ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కాబట్టి మనమంతా కోఆర్డినేట్ చేసుకోవాలి’’

– భూటాన్ ప్రధాని లోతయ్ షేరింగ్

Latest Updates