‘వందేమాతరం’ అనని నితీశ్ కుమార్

pm-modi-chant-vande-mataram-but-nitish-kumar-did-not-in-bihars-darbhanga-

మోడీ సభ వీడియో వైరల్

పాట్నా: ప్రధాని మోడీ వందే మాతరం అని చేతులు పైకెత్తి నినాదాలు చేస్తుంటే..  బీహార్ సీఎం నితీశ్ కుమార్ మౌనంగా కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఆర్టికల్ 370, యూనిఫామ్ సివిల్ కోడ్, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి ముఖ్యమైన అంశాలపై బీజేపీ, జేడీయూ మధ్య సయోధ్య లేనట్లు తెలుస్తోంది. గత నెల 25న బీహార్ లోని దర్భంగా ఎన్నికల ప్రచార సభలో మోడీతోపాటు  బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ప్రసంగం తర్వాత మోడీ వందేమాతరం నినాదాలిచ్చారు. సభకు వచ్చిన అందరూ నిలబడి  వందేమాతరం నినాదం చేశారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం కూర్చున్న చోట మౌనంగా ఉండిపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో  వైరల్ కావడంతో అధికార కూటమికి ఇబ్బందిగా మారింది. ఈ వీడియోపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ లో స్పందించారు. బీజేపీ మద్దతుదారులు నితీశ్ కుమార్ కు దేశద్రోహిగా ముద్ర వేయరు కదా అని ఆయన ప్రశ్నించారు.  దర్భంగాలో ఆర్జేడీ అభ్యర్థి అబ్దుల్ బారీ సిద్దిఖీ ఇటీవల వివాదాస్పద కామెంట్స్ చేశారు.  “భారత్ మాతా కీ జై అని అంటాం కానీ.. వందేమాతరం అని మాత్రం అనబోం. అది మా నమ్మకాలకు వ్యతిరేకం” అని  అన్నారు.

Latest Updates