చంద్రయాన్ -2 ప్రయోగం ఆసాంతం నిలబడి చూసిన ప్రధాని మోడీ

pm-modi-congratulated-isro-team-on-chandrayaan-2

ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన చంద్రయాన్ -2 ప్రయోగం దేశానికి, 130 కోట్ల దేశ ప్రజలకు గర్వకారణమని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఢిల్లీలోని తన కార్యాలయం నుంచే ఆయన ప్రయోగాన్ని చూశారు. ప్రయోగం జరుగుతున్నంతసేపూ… ప్రధాని ఉత్కంఠతో నిలబడి చూశారు. ప్రయోగం విజయవంతమైందన్న ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటన తర్వాత ఆయన సైంటిస్ట్ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రయోగంలోని పొరపాటును తెల్సుకుని దానిని నిలిపివేయడం ఒక తెలివైన నిర్ణయమనీ… ఆ పొరపాటును సరిచేసి తిరిగి విజయవంతమైన ప్రయోగం చేయడం గొప్ప విషయం అని ప్రధాని మోడీ చెప్పారు. ఇంత జాగ్రత్తగా వ్యవహరించడంపై ఆయన ప్రశంసించారు.

ఇస్రో చేసిన అంతరిక్ష యాత్రలో ఓ చరిత్ర కాబోతోందని చెప్పారు ప్రధాని. పూర్తిస్థాయి దేశీయ పరిజ్ఞానంతో చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ కావడం మరింత సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. చంద్రయాన్ -2 ప్రయోగంలోని ఆర్బిటార్, ల్యాండర్-రోవర్ లు.. చంద్రుడి ఉపరితలం నుంచి సమాచారాన్ని అందివ్వబోతున్నాయన్నారు.

చంద్రయాన్ ప్రయోగం ఇప్పటివరకు ఎవరూ చేయని కొత్త ప్రయోగం అన్నారు మోడీ. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఏముందో ఇప్పటివరకు ఏ ప్రయోగం చెప్పలేదని.. మొట్టమొదటిసారిగా చంద్రయాన్ -2 తో ఇస్రో ఈ సమాచారం సేకరించబోతోందని చెప్పారు మోడీ.

Latest Updates