లాక్ డౌన్ పొడిగింపుపై 11న ఫైనల్ డెసిషన్

సీఎంలతో ప్రధాని మోడీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్

న్యూ ఢిల్లీ: కరోనా కంట్రోల్ కు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వచ్చే మంగళవారం నాటికి ముగియనుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న మేరకు లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేక కొనసాగిస్తారా అనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మరోసారి పొడిగింపుపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. బుధవారం పార్లమెంట్ హౌస్ లో వివిధ పార్టీ లీడర్స్ తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న (శనివారం) మరోసారి ముఖ్యమంత్రులందరితో చర్చిస్తామన్నారు. లాక్ డౌన్ ను కొనసాగించాలా వద్దా అనేదానిపై అప్పుడే క్లారిటీ వస్తుందన్నారు. కరోనా కేసులు ఎక్కువ అవుతున్న మేరకు లాక్ డౌన్ కొనసాగించాలన్న కొన్ని రాష్ట్రాల అభ్యర్థనలను కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు.. ఆంక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు పాటించాల్సిన విధానాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు.

పొడిగింపుకే మొగ్గు
మోడీతో భేటీ ముగిసిన తర్వాత లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడారు. లాక్ డౌన్ పొడిగించాలని చాలా రాష్ట్రాల సీఎంలతో పాటు, నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని చెప్పారు. యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రం అదే దిశగా ఆలోచిస్తోందని, ప్రధాని.. సీఎంలతో చర్చించిన తర్వాత నిర్ణయం వెలువడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మరో నెల రోజులు బంద్
అన్ని విద్యాసంస్థలను మరో నాలుగు వారాల పాటు మూసి ఉంచాలని ప్రధాని మోడీకి కేంద్ర మంత్రుల టీం సిఫార్సు చేసింది. లాక్ డౌన్ కారణంగా దేశంలో పరిస్థితి పై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్​ ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, రామ్ విలాస్ పాశ్వాన్ సహా పలువురు మంత్రులు భేటీ అయ్యారు. రిలీజియస్ మీటింగ్న్, ఇతర సమావేశాలను కూడా బ్యాన్ చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా పంటల కోతలకు రాష్ట్రాలు అనుమతించవచ్చునని సిఫార్సు చేశారు. దశల వారీగా విమాన ప్రయాణాలను ప్రారంభించాలని సూచించారు.

Latest Updates