ప్రతిపక్షాలు సైన్యాన్ని నమ్మట్లేదు: మోడీ

కన్యాకుమారి: ఉగ్రవాదంపై మన పోరాటాన్ని ప్రపంచం మొత్తం మెచ్చుకుంటుంటే.. కొందరు ప్రతిపక్ష నేతలు మాత్రం భారత బలగాల సత్తాను అనుమానిస్తున్నాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తం సైన్యానికి అండగా నిలుస్తోందని, కానీ కొద్ది మంది రాజకీయ నేతలు తనపై ద్వేషాన్ని దేశంపై చూపుతున్నారని అన్నారు. పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై మన సైన్యం చేసిన దాడులను సైతం వాళ్లు అనుమానిస్తున్నారని, వాళ్లు తమ స్టేట్మెంట్లతో పాకిస్థాన్ కు సాయం చేస్తున్నారని అన్నారు. వారి రాజకీయాల కోసం భారత్ కు నష్టం కలిగిస్తున్నారన్నారు. వాళ్ల మాటలను పాక్ ప్రధాని పార్లమెంటులో, పాక్ రేడియోలో కోట్ చేస్తున్నారని మెహబూబా ముఫ్తీ, మమతా బెనర్జీ, చంద్రబాబుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమిళానాడులో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రామేశ్వరం – ధనుష్కోటి మధ్య రైల్వే లైనుకు శంకుస్థాపన చేశారు. 1964లో ప్రకృతి విపత్తుల కారణంగా ఇక్కడి రైల్వే లైన్ ధ్వంసమైందని, కానీ 50 ఏళ్లుగా ఏ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదన్నారు.

అభినందన్ ను చూసి దేశం గర్విస్తోంది

తమిళనాడుకు చెందిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ ను చూసి నేడు దేశం మొత్తం గర్విస్తోందని మోడీ అన్నారు. అలాగే తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ భారత తొలి మహిళా రక్షణ మంత్రి కావడంపై తాను గర్వపడుతున్నానని చెప్పారు.

వాళ్లు మన ఆర్మీని నమ్మడం లేదు

మోడీ వ్యతిరేకులుగా చెప్పుకొంటున్న కొందరు నేతలు దేశానికి నష్టం చేస్తున్నారని అన్నారు ప్రధాని. మోడీ శాశ్వతం కాదని, భారత దేశం శాశ్వతమని గుర్తించాలన్నారు. ‘మీ రాజకీయాల కోసం దేశాన్ని బలహీనపరిచడం మానుకోవాలి’ అని కోరారు. దేశమంతా మన సైన్యానికి మద్దతుగా నిలుస్తుంటే.. వాళ్లు మాత్రం ఆర్మీ సత్తాను అనుమానిస్తున్నారని అన్నారు. వాళ్లు మన ఆర్మీని నమ్ముతున్నారా? లేక దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని నమ్ముతున్నారా? స్పష్టం చేయాలన్నారు.

యూపీఏ హయాంలో సైన్యానికి స్వేచ్ఛ లేదు

కొద్ది రోజులుగా దేశంలో జరుగుతున్నది చూస్తే సైన్యం ఎంత బలోపేతంగా ఉందో తెలుస్తుందని మోడీ చెప్పారు. ఇది నవ భారతానికి కొత్త రూపు అన్నారు. ప్రస్తుతం భారత్ పై ఉగ్రవాదులు దాడులు చేస్తే వడ్డీతో కలిసి వారిపై దెబ్బకొడతామని చూపించామన్నారు. కానీ యూపీఏ హయాంలో సైన్యానికి స్వేచ్ఛ లేదని మోడీ అన్నారు. 26/11 ముంబై దాడుల సమయంలో ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని భావిస్తోందని వార్తలు వచ్చాయని, కానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదని అన్నారు. అయితే ఈ రోజు భారత్ లో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందన్న వార్తలు వింటున్నామని మోడీ చెప్పారు.

నాడు 26/11 ముంబై దాడి సమయంలో టెర్రరిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుందని, కానీ అలాంటిదేం జరగలేదని అన్నారు. ఉరీ దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చూశాం, మళ్లీ పుల్వామా దాడి తర్వాత మన సైనికుల సాహసాన్ని మరోసారి చూశారని అన్నారు.

Latest Updates