అంబానీ, అదానీలకు మోడీ లౌడ్ స్పీకర్

  • మరికొద్ది నెలల్లోనే దేశమంతా మోడీని వ్యతిరేకిస్తుంది: రాహుల్

మరికొద్ది నెలల్లోనే దేశమంతా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిలబడే రోజు వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన కేవలం అతి కొద్ది మంది కుబేరులను తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మేవాట్ సమీపంలోని నూహ్ ప్రాంతంలో సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన స్నేహితులైన ధనిక పారిశ్రామికవేత్తలకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని, రోజంతా అంబానీ, అదానీల గురించే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆ ఇద్దరు కుబేరులకు మోడీ లౌడ్ స్పీకర్ గా మారారని అన్నారు రాహుల్.

ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితి ఆందోళనకరంగా ఉందని, ఇలాగే కొనసాగితే మరో ఆరు నెలల్లో నిరుద్యోగం పెరిగిపోతుందని రాహుల్ గాంధీ అన్నారు. అబద్ధాలతో ఎక్కువ కాలం యువతను మోసం చేయలేరని చెప్పారు. మరి కొద్దినెలల్లోనే దేశం మొత్తం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిలబడే రోజు వస్తుందని రాహుల్ హెచ్చరించారు.

ప్రజలు తమలో తామే పోట్లాడుకునేలా బీజేపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు రాహుల్. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు.

Latest Updates