రవాణారంగానికి రూ.30 లక్షల కోట్లు

నదుల అనుసంధానానికి రూ.7 లక్షల కోట్లు  బ్లూ ప్రింట్​లో పేర్కొన్న బీజేపీ

న్యూఢిల్లీ: తాజాగా అధికారంలోకి వస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణారంగానికి ప్రాధాన్యం ఇస్తున్నది. రాబోయే ఐదేళ్లలో ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రూ.30 లక్షల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు కేటాయించిన రూ.100 లక్షల కోట్ల పెట్టుబడుల్లో రవాణారంగానికి మూడొంతుల నిధులు కేటాయించడం విశేషం. వీటిని రైల్వేల అభివృద్ధికి, నదుల అనుసంధానానికి, హైవేల విస్తరణకు ఉపయోగించనున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ విడుదల చేసిన బ్లూప్రింట్‌‌లో ఈ విషయాలను పేర్కొన్నారు.

దీనిప్రకారం.. రక్షణరంగం ఆధునీకరణకు రూ.తొమ్మిది లక్షల కోట్లు కేటాయిస్తారు. రవాణారంగం అభివృద్ధిలో భాగంగా బుల్లెట్‌‌ట్రేన్‌‌ కారిడార్ల నిర్మాణానికి, రవాణా కారిడార్ల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్లు ఇస్తారు. నౌకాశ్రయాల అభివృద్ధికి రూ.మూడులక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఇందులో ఎక్కువ నిధులను సాగరమాల ప్రాజెక్టుకు ఇస్తారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్‌‌పోర్టులేగాక సామాజిక వసతులు.. అంటే విద్య, ఆరోగ్య, సాగురంగానికీ భారీగా నిధులు అందిస్తారు. బడ్జెట్‌‌ కేటాయింపులతోపాటు ప్రభుత్వరంగ సంస్థలు, వయబిలిటీ గ్యాప్‌‌ ఫండింగ్‌‌ ద్వారా అందే నిధులనూ క్యాపిటల్‌‌ వ్యయం అంచనాల్లో చేర్చుతారు.

2013 ఆర్థిక సంవత్సరం నుంచి మూలధన వ్యయం 113 శాతం పెరిగి రూ.9.6 లక్షల కోట్లకు చేరింది. రాబోయే ఐదేళ్లలో జీడీపీతోపాటే ఇదీ పెరుగుతుందని చెబుతున్నారు. లేబర్‌‌ ఖర్చులు రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. ఇక నదుల అనుసంధానం విషయానికి వస్తే 37 నదుల్లోని మిగులు జలాలను లోటు ఉన్న ప్రాంతాలకు తరలించాలని బీజేపీ బ్లూప్రింట్‌‌ పేర్కొంది. ఇందుకోసం రూ.11 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాబోయే ఐదేళ్లలో ఇందుకు రూ.ఏడు లక్షల కోట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. పట్టణాల్లో  రెండు కోట్ల ఇళ్లు నిర్మించడానికి రూ.ఐదు లక్షల కోట్లు కేటాయించాలని ఈ బ్లూప్రింట్‌‌ పేర్కొంది.

Latest Updates