కురుక్షేత్ర‌ యుద్ధంలో 18 రోజుల్లో గెలుపు: క‌రోనాపై మ‌న‌ యుద్ధం 21 రోజులు..

క‌రోనాపై పోరాటాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌హాభార‌తంలో కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌర‌వుల‌పై పాండ‌వులు 18 రోజుల పోరాటం త‌ర్వాత గెలిచార‌ని అన్నారు మోడీ. ఇప్పుడు క‌రోనాపై దేశం మొత్తం పోరాడుతోంద‌ని, ఈ యుద్ధం 21 రోజులు సాగుతుంద‌ని చెప్పారు. మ‌నం 21 రోజుల్లో ఈ మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధించాల‌ని ప్ర‌జ‌లంద‌రికీ పిలుపునిచ్చారాయ‌న‌. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు దేశ‌మంతా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత తొలిసారి ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన వార‌ణాసి ప్ర‌జ‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. ‘వార‌ణాసి ఎంపీగా నేను ఈ క‌ష్ట‌కాలంతో మీతోనే ఉండాలి. కానీ ఢిల్లీలో ఉండి నిరంతం ఈ క‌రోనా మ‌హమ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను మీరంతా చూస్తూనే ఉన్నారు’ అని మోడీ అన్నారు. ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ తాను ప్ర‌తి రోజూ వార‌ణాసిలో ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు తెలుసుకుంటూ స‌మీక్ష చేస్తున్నాన‌ని తెలిపారు.

ఒక్కొక్క‌రు 9 కుటుంబాల‌కు సాయం చేయండి

ఇవాళ వ‌సంత న‌వ‌రాత్రులు మొద‌ల‌య్యాయి. మీరంతా పూజ‌లు చేస్తూ.. దేవుడిని ప్రార్థిస్తూ బిజీగా ఉండుంటారు. అయినా నాతో మాట్లాడ‌డానికి స‌మ‌యం కేటాయించినందుకు మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.
క‌రోనా వైర‌స్ పై పోరాటంలో ప్ర‌తి ఒక్క‌రికీ శ‌క్తినివ్వాల‌ని ఆ శైలపుత్రి పార్వ‌తీ దేవిని నేను వేడుకుంటున్నా అని చెప్పారు ప్ర‌ధాని మోడీ. స్తోమ‌త‌, శ‌క్తి ఉన్న వాళ్లు ఈ 21 రోజుల పాటు 9 కుటుంబాల‌కు అండ‌గా నిలిచి వారి పోష‌ణ లాంటి అవ‌స‌రాల‌కు సాయం చేయాల‌ని, అదే న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌కు అదే నిజ‌మైన అర్థమ‌ని అన్నారాయ‌. లాక్ డౌన్ కార‌ణంగా జంతువులు కూడా ఇబ్బంది ప‌డుతున్నాయ‌ని, చుట్టుప‌క్క ఉన్న జంతువుల‌కు ఆహారం పెట్టి వాటి ప్రాణం నిల‌పాల‌ని సూచించారు.

Latest Updates