మోడీ గట్టొడు: ప్రధానిపై ట్రంప్ పొగడ్తల వర్షం

ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. ఛాయ్‌వాలా నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన ఎందరికో ఇన్‌స్పిరేషన్ అన్నారు. రెండ్రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్ అక్కడి నుంచి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ తర్వాత మోతెరా స్టేడియానికి చేరుకుని.. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడడం మొదలుపెట్టగానే స్టేడియంలోని జనమంతా ఒక్కసారిగా ‘నమస్తే ట్రంప్’ అంటూ స్వాగతం చెప్పారు. ‘నమస్తే.. హలో ఇండియా’ అంటూ ప్రసంగం మొదలుపెట్టారు ట్రంప్. మోడీని తనకు మంచి మిత్రుడని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నానని చెప్పారాయన.

ఐదు నెలల క్రితం ప్రధాని మోడీకి టెక్సాస్‌లో ఫుట్‌బాల్ స్టేడియంలో ఘన స్వాగతం పలికామని, ఇప్పుడు తనకు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో భారత్ స్వాగతం చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ‘అమెరికా భారత్‌ను ప్రేమిస్తుంది. ఇండియాను గౌరవిస్తుంది. భారత ప్రజలకు ఎల్లప్పుడూ విధేయంగా ఉంటుంది. భారతీయులకు నమ్మకమైన నేస్తం అమెరికా’ అని చెప్పారు ట్రంప్.

ఛాయ్‌వాలా నుంచి..

ప్రధాని మోడీ కేవలం గుజరాత్‌కు మాత్రమే గర్వకారణం కాదన్నారు ట్రంప్. పట్టుదలతో శ్రమిస్తే భారతీయులు ఏమైనా సాధించగలరన్న దానికి ఆయన ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు.  ఛాయ్‌వాలాగా జీవితం మొదలు పెట్టిన మోడీ ప్రధాని స్థాయికి చేరుకున్నారన్నారు. ‘మీ ఎంతగానో ప్రేమించే మోడీ చాలా గట్టొడు. యావద్దేశానికి గర్వకారణం’ అని అన్నారు ట్రంప్.

ప్రపంచం మొత్తానికి భారత్ ఆదర్శమని, అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియా 70 ఏళ్లలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని చెప్పారు. కేవలం ఒక్క దశాబ్దంలోనే 27 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేశారన్నారు.

Latest Updates