వారణాసిలో మోడీ మెగా రోడ్ షో.. 26న నామినేషన్

యూపీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు బీజేపీ నేతలు. వారణాసి నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా మరోసారి పోటీ చేయాలని నిర్ణయించారు నరేంద్రమోడీ. ఏప్రిల్ 26వ తేదీన ఇక్కడినుంచి మోడీ నామినేషన్ వేయనున్నారు. అందుకు ఒక్కరోజు ముందు… ఏప్రిల్ 25 గురువారం నాడు వారణాసిలో మెగా రోడ్ షో చేయబోతున్నారు నరేంద్రమోడీ.

వారణాసిలో మోడీ రోడ్ షోను భారీగా నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీకి సంబంధించిన టాప్ పొలిటీషియన్స్ అందరూ ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. గురువారం మధ్యాహ్నం… బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిధిలోని లంక గేట్ నుంచి మోడీ రోడ్ షో ప్రారంభం అవుతుంది. పండిట్ మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి మోడీ పూలమాల వేసి రోడ్ షో మొదలుపెడతారు.  అక్కడి నుంచి 150 ప్రాంతాల్లో మోడీ స్వాగతం అందుకుంటారు. మదన్ పురా, సోనార్ పురా లాంటి ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలమీదుగా మోడీ రోడ్ షో కొనసాగుతుంది.

ఈ రోడ్ షోలో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు… కాశీ దశాశ్వమేథ్ ఘాట్ దగ్గర మోడీ… గంగా హారతి ఇవ్వడంతో ఆయన రోడ్ షో ముగుస్తుంది.

మే 19న చివరి ఫేజ్ లో వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసిన నరేంద్రమోడీ… అరవింద్ కేజ్రీవాల్(ఆమ్ ఆద్మీ పార్టీ), అజయ్ రాయ్(కాంగ్రెస్)లను భారీ తేడాతో ఓడించారు. ఈసారి కూడా అదే ఫలితం రిపీట్ చేయాలని మోడీ భావిస్తున్నారు.

Latest Updates