పాక్, కాంగ్రెస్ మధ్య ఈ కెమిస్ట్రీ ఏంటో!: మోడీ

  • బాలాకోట్ మాట వింటే.. నొప్పలతో కాంగ్రెస్ నేతలు విలవిల

సోనిపట్: హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. సోనిపట్ లో జరిగిన బీజేపీ ప్రచార సభలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. స్వచ్ఛ భారత్, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి మాటలు వింటే కాంగ్రెస్ నేతలకు కడుపు నొప్పి వచ్చేస్తోందంటూ సెటైర్లు వేశారు. ఇక పొరబాటున ఎవరైనా మన వాయుసేన సరిహద్దు దాటి వెళ్లి బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేసిన పాక్ ఉగ్రస్థావరం  బాలాకోట్ పేరెత్తితే వారిక నొప్పులతో విలవిలలాడుతూ చిందులు తొక్కుతారని అన్నారు. పాకిస్థాన్ తరఫున ప్రపంచ వ్యాప్తంగా బలంగా తమ వాదన వినిపించడానికి కాంగ్రెస్ ను వాడుకుంటోందన్నారు. పాక్, కాంగ్రెస్ మధ్య ఈ కెమిస్ట్రీ (ఆ బంధం) ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు మోడీ.

కాంగ్రెస్ పాలనలో ఎవరికీ రక్షణ లేదు

భారత్ ను అన్ని రంగాల్లోనూ హర్యానా గర్వంగా నిలబెట్టిందన్నారు ప్రధాని మోడీ. ఇక్కడి నుంచి వచ్చిన రెజ్లర్లు భారత్ కు మెడల్స్ సాధించి పెట్టారని, హర్యానా యువత భరతమాత సేవలో నిలిచి ఉగ్రవాదంపై పోరాడుతున్నారని అన్నారు. ః

కానీ, కాంగ్రెస్ పాలనలో ఎవరికీ రక్షణ కల్పించలేకపోయారని, జవాన్లకు, రైతులకు, క్రీడాకారులకు కూడా భద్రత లేదని చెప్పారు. అన్ని రంగాల్లోనూ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు.

వచ్చే ఐదేళ్లలో 3.5 లక్షల కోట్లతో తాగు, సాగు నీటికి కొరత లేకుండా చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 2024 కల్లా రైతులు, మహిళలకు కష్టాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

Latest Updates