అయోధ్య తీర్పు: జాతినుద్దేశించి మోడీ ప్రసంగం

అయోధ్య తీర్పు వచ్చిన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశమంతా స్వాగతించిందని ఆయన అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి మతం ఈ తీర్పును సంతోషంగా ఆహ్వానించాయని చెప్పారు. సామరస్య భావంతో నిండిన సమాజం.. భారత ప్రాచీన సంప్రదాయంలో భాగమన్నదానికి ప్రజలు తీర్పును స్వాగతించిన తీరే నిదర్శనమని అన్నారు మోడీ.

అయోధ్య కేసు రోజువారీ విచారణ ద్వారా పరిష్కారం కావాలని దేశ ప్రజలంతా కోరుకున్నారని చెప్పారు ప్రధాని మోడీ. నేడు ప్రజలంతా కోరుకున్న విధంగా తీర్పు రావడం గొప్ప విషయమని అన్నారు. దశాబ్దాలుగా నానుతున్న ఈ కేసు ఇవాళ్టితో ముగిసిందన్నారు.

ఎంతో క్లిష్టమైన సమస్యలను కూడా న్యాయ వ్యవస్థ పరిష్కరించగలదని నేడు రుజువైందని మోడీ అన్నారు. సుప్రీం కోర్టు అన్ని వర్గాల వాదనలను ఎంతో ఓపికతో విని ఈ తీర్పునిచ్చిందని చెప్పారు. అన్ని పక్షాలకు ఆమోదయోగ్యంగా వచ్చిన నిర్ణయంతో దేశమంతా సంతోషంగా ఉందన్నారు.

అయోధ్య కేసులో వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి ఇస్తూ.. మసీదు కట్టడానికి అయోధ్యలోనే మరోచోట ఐదెకరాల భూమి కేటాయించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

నెగిటివిటీ.. భయం లేదు: నవ భారతం నిర్మిద్దాం

బెర్లిన్ గోడను కూలదోసి.. జర్మనీ ఏకమైన రోజు ఇదేనని చెప్పారు మోడీ. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ కారిడార్ కూడా ఇవాళే ప్రారంభమైందని అన్నారు. ఈ రోజునే అయోధ్య తీర్పు కూడా రావడంతో ఐక్యతపై అపూర్వమైన సందేశం ఇచ్చిట్టుగా ఉందన్నారు. నెగిటివిటీ, భయం అనే వాటికి భారత్‌లో స్థానం లేదని, అందరం కలిసి ఐక్యంగా నవ భారతాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారాయన.

Latest Updates