బుద్ధుడి ఆదర్శాలతో అసాధారణ సవాళ్లను ఎదుర్కోవచ్చు: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: బుద్ధ భగవానుడి బోధనలను అనుసరించడం ద్వారా ప్రస్తుత కాలంలో ఎదురవుతున్న అనేక సమస్యలు, సవాళ్లను దీటుగా ఎదుర్కోవచ్చని దేశ ప్రజలు, యువతకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. శనివారం ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ సందర్భంగా మోడీ బుద్ధుడి పలు బోధనలను గురించి చెప్పారు. ‘ప్రస్తుతం ప్రపంచం అనూహ్య సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ చాలెంజ్‌లకు దీర్ఘ కాల పరిష్కారాలు బుద్ధ భగవానుడి ఆదర్శాలతోనే సుసాధ్యం అవుతుంది. ఆ బోధనలు గతానికి ఆచరణీయంగా ఉన్నాయి. అలాగే వర్తమానంలోనూ అనుసరణీయమైనవే. భవిష్యత్తులోనే ఆచరించాల్సినవే. చురుకైన యువ మెదళ్లు గ్లోబల్ ప్రాబ్లమ్స్‌కు సమాధానాలు కనుగొనే యత్నం చేస్తున్నాయి. ఎక్కువ స్థాయిలో స్టార్టప్ ఎకో సిస్టమ్ కలిగిన దేశంగా ఇండియాను చెప్పొచ్చు. బుద్ధుడి ఆలోచనతో కూడా కనెక్ట్ అయి ఉండమని నేను మన యంగ్ ఫ్రెండ్స్‌కు సూచిస్తున్నా. ఆయన మీలో స్ఫూర్తి నింపడంతోపాటు సరైన దారి చూపిస్తాడు. బుద్ధిస్ట్‌ పర్యాటక ప్రాంతాలపై మేం ఫోకస్ చేస్తున్నాం. కొన్ని రోజుల క్రితమే ఇండియన్ కేబినెట్ ఖుషీనగర్ ఎయిర్‌‌పోర్ట్‌ను ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌గా ప్రకటించింది. ఇది కార్యరూపం దాల్చితే అనేక మంది ప్రజలు, యాత్రికులు, భక్తులు సందర్శనకు వచ్చే అవకాశం ఉంది’ అని మోడీ పేర్కొన్నారు.

Latest Updates