సైన్యానికి దన్ను… భారీ వంతెన ప్రారంభించనున్న ప్రధాని మోడీ

దేశంలోనే అతి పొడవైన నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ వంతెన అందుబాటులోకి రాబోతోంది. అస్సాంలోని బ్రహ్మ పుత్ర నదిపై డిబ్రూగఢ్ ప్రాంతంలో అత్యంత పొడవైన బోగీబీల్ బ్రిడ్జీ నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈ నదిపై గతంలో మూడు బ్రిడ్జీలు నిర్మించారు. ఇప్పుడు కడుతున్న ఈ బ్రిడ్జి.. దేశంలోనే అతి పెద్ద నదీ వంతెనల్లో మూడోది. బ్రహ్మపుత్ర నదిపై అత్యంత పెద్దది. చైనా సరిహద్దులో సైన్యానికి అత్యంత ఎక్కువగా ఉపయోగపడే ఈ వంతెనను డిసెంబర్ 25వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించబోతున్నారు.

డబుల్ డెక్కర్ వంతెన

హిందూస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ … బోగీబీల్ బ్రిడ్జిని నిర్మించింది. రూ.1,328 కోట్ల ప్రాజెక్టు ఇది. బ్రహ్మపుత్ర నదికి 32 మీటర్ల ఎత్తున ఈ భారీ వంతెన నిర్మించారు. 4.94 కిలోమీటర్ల పొడవుతో ఈ వంతెన కడుతున్నారు. ఇది డబుల్ డెక్కర్ వంతెన. కింద రైలు మార్గం ఉంటుంది. దానిపై రెండు ట్రాక్ లు ఉంటాయి. పైన రెండు ఫుట్ పాత్ లు, మూడు వరుసల్లో హైవే లాంటి రోడ్డు మార్గం ఉంటుంది.

ఎన్నో విశేషాల రివర్ బ్రిడ్జి

ఇండియన్ రైల్వేస్ లోనే పూర్తిగా స్టీల్ తో నిర్మిస్తున్న మొట్టమొదటి బ్రిడ్జి ఇది. పది ఈఫిల్ టవర్లకు అవసరమైనంత స్టీల్ తో ఈ బోగీబీల్ వంతెన నిర్మించారు. బ్రిడ్జికి 42 పిల్లర్స్ ఉంటాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలకు, సరుకు రవాణాకు ఈ మార్గం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాభై లక్షల మంది దీనిని వినియోగిస్తారని అధికారులు అంటున్నారు. ఇండియన్ మిలటరీ బేస్ లకు ఇది చాలా కీలకం. చైనాతో 4వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్ కు సాయుధ బలగాలు, యుద్ధ, మిలటరీ సామాగ్రి తరలింపులో ఈ నది వంతెన ఉపయోగపడనుంది.

 

Posted in Uncategorized

Latest Updates