లాక్​డౌన్ పొడిగింపుపై మోడీ డిస్కషన్

  • సీఎంలతో రేపు వీడియోకాన్ఫరెన్స్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్​డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మరికొద్ది రోజులు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్ ను కొనసాగిస్తేనే బెటర్ అని ఇప్పిటికే కొన్ని రాష్ట్రాల సీఎంలు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఒడిషా రాష్ట్రం ఓ అడుగు ముందుకేసి లాక్​డౌన్ ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించింది. తబ్లిగి ఘటన తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న మేరకు లాక్​డౌన్​ని పొడిగించేందుకు చాలా రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ ని పొడిగించాలా వద్దా అనేదానిపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(ఏప్రిల్11) అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. సీఎంలతో మాట్లాడిన తర్వాత పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకుంటారని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. 21 రోజుల లాక్​ డౌన్ ఏప్రిల్ 14న ముగియనున్న మేరకు ఆలోపే జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడతారని, అప్పుడే పొడిగింపుపై కీలక ప్రకటన చేస్తారని సమాచారం.

పొడిగింపు కన్ఫామ్ ?

ఏప్రిల్ 14న లాక్​డౌన్ ను ఎత్తివేయలేమని, ప్రతి ఒక్కరి ప్రాణాలే ముఖ్యమని పార్లమెంట్​లో వివిధ పార్టీ లీడర్లతో ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. వైరస్ వ్యాపిస్తున్న మేరకు లాక్​డౌన్ ను పొడిగించాలని జిల్లాలు, రాష్ట్రాలు, నిపుణులు సూచించారని, వారి సజెషన్స్ ను కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తున్నదని చెప్పారు. ‘‘లాక్​డౌన్​ను ఎత్తివేయట్లేదు. లైఫ్ ప్రీ-కరోనా, పోస్ట్ కరోనా ఒకేలా ఉండవని ప్రధాని మోడీ స్పష్టం చేశారు” అని బిజు జనతాదళ్ నేత పినాకి మిశ్రా బుధవారం మోడీతో ఇంటరాక్షన్ తర్వాత మీడియాతో చెప్పారు. దేశంలో విద్యా సంస్థలు మరికొద్ది రోజులు బంద్ చేయాలని, రిలీజియస్, బిజినెస్, పొలిటికల్ తదితర మీటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలని ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రధానికి సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ను కొన్ని మార్పులతో పొడిగించే వైపే మోడీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా సమాచారం.

Latest Updates