వేలంలో రూ.కోటి పలికిన మోడీ ఫొటో స్టాండ్

  • 500 రూపాయలతో మొదలైన వేలం రూ.కోటితో ముగిసింది
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన గిఫ్టుల ఈ-వేలం
  • www.pmmementos.gov.in వెబ్ సైట్ లో ఆక్షన్
  • అక్టోబరు 3 వరకు 2772 వస్తువుల వేలం నిర్వహణ
  • వచ్చిన సొమ్ముంతా నమామి గంగే ప్రాజెక్టుకు విరాళం

PM Modi's photo stand auctioned for Rs 1 croreకేవలం రూ.500లతో వేలం మొదలైన వస్తువు మహా అంటే వేలల్లో ముగుస్తుంది. అంతే కదా.. కానీ, లక్షలు మించి రూ.కోటి ధర పలికితే… నమ్మశక్యంగా లేదు కదూ. ఇది ముమ్మాటికి నిజం. అయితే దానికేదో స్పెషాలిటీ ఉండే ఉంటుందని అనుకుంటున్నారా? అవును నిజమే. ఆ వస్తువుకే కాదు. ఆ వేలానికి కూడా ప్రత్యేకత ఉంది. అది ప్రధాని నరేంద్ర మోడీకి గడిచిన ఆరు నెలలుగా వచ్చిన గిఫ్టుల వేలం. అంతేకాదు, అందులో వచ్చిన సొమ్మునంతా ఓ మంచి పనికి వాడబోతున్నారు. గంగా నదిని శుద్ధి చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఈ వేలంలో వచ్చిన డబ్బును ఇస్తున్నారు.

www.pmmementos.gov.in వెబ్ సైట్ ద్వారా మొదలైన ఈ-వేలంలో ఇవాళ రెండు వస్తువులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఒకటి మోడీ ఫొటో స్టాండ్, రెండోది వెండి కలశం.

ఫొటో స్టాండు ప్రారంభ ధరను రూ.500గా నిర్ణయించారు. అది ఏకంగా రూ.కోటి పలికింది. అలాగే రూ.18000 ప్రారంభ ధర పెట్టిన కలశం కూడా రూ.కోటికి అమ్ముడైంది. ఈ కలశాన్ని మోడీకి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గిఫ్ట్ గా ఇచ్చారు.

ఇలా మోడీ గిఫ్టులను వేలం వేయడం ఇది రెండోసారి. గత జనవరిలో తొలిసారి ఆన్ లైన్ ఆక్షన్ నిర్వహించారు. 1800 వస్తువులకు నిర్వహించిన వేలంలో నాలుగు వేల మంది పాల్గొన్నారు.

ఇప్పుడు జరుగుతున్న వేలంలో 2722 వస్తువులను వేలంలో ఉంచారు. వాటిలో శాలువాలు, జ్ఞాపికలు, ఖడ్గాలు, ఫొటోలు, సిల్వర్, మెటల్ వస్తువులు వంటివి ఉన్నాయి. ఈ వస్తువులున్నీ ప్రస్తుతం నేషనల్ మోడరన్ ఆర్ట్ గ్యాలరీలో  ప్రదర్శిస్తున్నారు. అక్టోబరు 3 వరకు ఈ వేలం నిర్వహించి ఆయా వస్తువులను బిడ్డర్లకు అప్పగిస్తారు.

Latest Updates