కన్నీరు పెట్టుకున్న ఇస్రో చైర్మన్ : భారతీయుల ఆనందాన్ని చంద్రయాన్-2 లాక్కెళ్లిపోయింది!

బెంగళూరులోని ఇస్రో కేంద్రం. అప్పటి దాకా చప్పట్లు, విరబూసిన ముఖాలతో ఉన్న ఆ ప్రాంగణం ఒక్కసారిగా మారిపోయింది. అంతా అయిపోయింది. జస్ట్.. కొన్ని నిమిషాలే. ఇన్నేళ్ల శ్రమకు ఫలితం దక్కబోతోంది. నిద్రాహారాలు మాని చేసిన పనికి ఫలితం కళ్లముందు సాక్షాత్కరించబోతోంది. అందరిలోనూ ఇదే ఆనందం.. తెలియని ఉత్సాహం. అంతకుమించి.. చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయబోతున్నామనే ఓ విజయగర్వం కనిపించింది. కానీ.. కొన్ని సెకన్ల వ్యవధిలో పరిస్థితులు తారుమారయ్యాయి. విక్రమ్ ల్యాండర్ కనిపించకుండా పోయింది.

కీలక దశలన్నీ దాటుకుని.. చంద్రుడి కక్ష్య నుంచి బయటకొచ్చిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ గల్లంతైంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. కంట్రోల్ సెంటర్ నుంచి అనుసంధానం కోల్పోయింది. కోట్లాది మంది భారతీయుల ముఖాల్లోని ఆనందాన్ని లాక్కెళ్లిపోయింది. 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా నిర్దేశిత కక్ష్యలో వెళ్లకుండా.. ల్యాండర్ రూటు మారింది. అప్పుడే సైంటిస్టుల ముఖాల్లో టెన్షన్ కనిపించింది. కాసేపయ్యే సరికి అది మరికాస్త పెరిగింది. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ రావడం లేదనే చేదు వార్త వినాల్సి వచ్చింది.

ముందు అనుకున్నట్టే శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.39 గంటలకు విక్రమ్ ను కిందకు దింపే ప్రయోగాన్ని ప్రారంభించారు. మూడు ఫేజులుగా ల్యాండింగ్ ను విభజించారు. రఫ్ బ్రేకింగ్ ఫేజ్ , నావిగేషన్ కంట్రోల్ ఫేజ్ , ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ లుగా విక్రమ్ ల్యాండిం గ్ కు ప్రయత్నించారు. రఫ్ బ్రేకింగ్ ఫేజ్ లో భాగంగా సైంటిస్టులు అనుకున్నట్టు గానే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్రమ్ ను 7.4 కిలోమీటర్ల దూరానికి తీసుకొచ్చారు. 6 నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియ సక్సెస్ అయింది. దీంతో సైంటిస్టులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత 1.45 గంటలకు నావిగేషన్ కంట్రోల్ ఫేజ్ ను ప్రారంభించారు. ఈ ఫేజ్ లో విక్రమ్ స్పీడ్ ను మరింత తగ్గించారు. ఆ ఫేజ్ పూర్తయ్యే సరికి వేగాన్ని సెకనుకు 60 మీటర్లకు తగ్గించారు. ఇందులో విక్రమ్ ఎత్తును 7.4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లకు తగ్గించారు. తర్వాత ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ లో భాగంగా 5 కిలోమీటర్ల నుంచి 400 మీటర్లకు తగ్గించే ప్రయత్నం చేశారు.

అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న టైంలో 2.1 కిలోమీటర్ల దూరంలో ఉందనగా గ్రౌండ్ కంట్రోల్ తో విక్రమ్ సంబంధాలు కట్ అయిపోయాయి. దీంతో సైంటిస్టుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. విక్రమ్ నుంచి సిగ్నళ్లు వస్తాయే మోనని ఎదురు చూశారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. మధ్యలో చంద్రయాన్ 2 ఆర్బిటర్ నుంచి విక్రమ్ డేటాను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్బిటర్ తో విక్రమ్ నుంచి డేటా వెళ్లినట్టు గుర్తించారు.

చంద్రయాన్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడడంపై ఇస్రో చైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకున్నారు. శాస్త్రవేత్తలను ఉద్దేశించి వెళ్లిపోతున్న మోడీకి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చారు శివన్. ఆ సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు శివన్. ఆయన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చారు మోడీ.

Latest Updates