చిన్న ఫ్యామిలీలే మనకు కరెక్ట్: ప్రధాని మోడీ

  • ఎర్రకోట పైనుంచి ప్రధాని మోడీ
  • ఇండిపెండెన్స్​ డే స్పీచ్​
  • కొత్తగా చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ పోస్టు
  • అక్టోబర్​ 2 నుంచి ప్లాస్టిక్​ను పూర్తిగా బ్యాన్​ చేద్దామని పిలుపు
  • ఒకేసారి ఎన్నికలకు ప్రయత్నిద్దాం
  • గంటన్నరపాటు ఏకధాటిగా ప్రసంగం

మన సమాజంలో జనాభా సమస్యను అర్థం చేసుకున్నవారు కొందరున్నారు. వాళ్లు పిల్లల్ని కనేముందుగానే వారికి మంచి చదువును అందించ గలుగుతామా? వాళ్ల కలల్ని  నెరవేర్చగలుగుతామా? అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారిని మనం గౌరవించాలి. వారి నుంచి నేర్చుకోవాలని నేను ప్రజలను కోరుతున్నాను. జనాభా సమస్యపై సామాజిక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి.

న్యూఢిల్లీ: దేశంలో జనాభా పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధిక జనాభాతో అనేక సమస్యలు తలెత్తుతాయన్న ఆయన, ఈ విషయంలో సవాళ్లను ఎదుర్కొనే టైమొచ్చిందన్నారు. జనాభా విస్ఫోటంపై దేశంలో చర్చ జరగాలని. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇష్యూని డీల్​ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా పెరుగుదల వల్ల ప్రభుత్వ పథకాల రూపకల్పన సవాలుగా మారుతుందని, రాబోయే తరాలకు అభివృద్ధి అందాలంటే జనాభాను కంట్రోల్​ చేసుకోవాల్సిందేనని చెప్పారు. ‘‘పిల్లల గురించి తల్లిదండ్రులు ముందే ఆలోచించుకోవాలి. పుట్టబోయే బిడ్డలకు న్యాయం చేయగలమా, వాళ్లకు కావాల్సిన సౌకర్యాల్ని అందించగలమాఅని తర్కించుకోవాలి. చదువుకున్నవాళ్లలో చాలా మంది ఇలా ఆలోచిస్తున్నారు. మిగతా వాళ్లను కూడా మేల్కొలపాలి”అని హితవుపలికారు. గురువారం 73వ ఇండిపెండెన్స్​ డే సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి పీఎం మాట్లాడారు. గంటన్నర స్పీచ్​లో మోడీ.. నేషనల్​ సెక్యూరిటీతోపాటు ప్లాస్టిక్​ బ్యాన్, పాపులేషన్​ కంట్రోల్, ఒకేసారి ఎన్నికలు, జమ్మూకాశ్మీర్​ తదితర అంశాలపై ఎన్డీఏ విజన్​ను వివరించారు.

చిన్న ఫ్యామిలీనే ముద్దు

సంఖ్యాపరంగా ఫ్యామిలీ చిన్నగా ఉండటమే మంచిదన్న ప్రధాని.. జనాభాను కంట్రోల్​లో ఉంచుకోవడం కూడా దేశభక్తిని చాటుకోవడమేనన్నారు. ఇల్లు, ఆరోగ్యం, చదువులు ఇవేవీ లేకుండా ప్రజలు సంతోషంగా ఉండలేరని, జనాభా పెరుగుదల వల్ల రాబోయే తరాలు తీవ్రంగా ఇబ్బందిపడతాయని అన్నారు. ‘‘ప్రభుత్వాలు ఎన్ని ప్లాన్లు వేసినా ప్రజలు సహకరించకుంటే ఫలితాలు రావు. చైనాకు దీటుగా మన జనాభా పెరుగుతోంది. నియంత్రణ కోసం కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మెరుగైన సంస్కరణలు చేశాయి. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తున్నారు’’అని గుర్తుచేశారు. తన పదవీకాలంలో ప్రధాని మోడీ జనాభా నియంత్రణపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి. పాపులేషన్​పై ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ నేతలు తరచూ కామెంట్లు చేసినా ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పాపులేషన్​ కంట్రోల్​పై మోడీ సర్కార్ త్వరలోనే విధానాల్ని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి ఎన్నికలు..

ఇండిపెండెన్స్​డే స్పీచ్​లో ఒకేసారి ఎన్నికల అంశాన్ని కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. జమ్మూకాశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దుతో దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లైందని, అంతకుముందు దేశం మొత్తం ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చామని, అలాగే ఒకేసారి ఎన్నికలపైనా ప్రజలు చర్చ జరపాలని అన్నారు. లోక్​సభతోపాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒకేసారి ఎన్నికలు జరపడం సాధ్యం కాదని నేషనల్​ లా కమిషన్ ​ గత ఆగస్టులో పేర్కొంది.

పాక్‌‌ మాటే లేదు

ఇండిపెండెన్స్‌‌ డే  రోజున ఎర్రకోట దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ గురువారం చేసిన ప్రసంగంలో  ఒక్కసారి కూడా పాకిస్తాన్‌‌  పేరును ప్రస్తావించలేదు. ప్రధాని  సుమారు 95 నిముషాలపాటు అనర్గళంగా ప్రసంగించారు. మోడీ వరుసగా  ఆరేళ్లపాటు  ఎర్రకోట మీద  జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నారు. ఈసారి ప్రధాని పాకిస్తాన్‌‌ను తన ప్రసంగంలో ప్రస్తావించకపోయినా… పాక్‌‌ ప్రధాని ఇమ్రాన్‌‌ఖాన్‌‌ మాత్రం  బుధవారంనాటి ఇండిపెండెన్స్‌‌ డే ప్రసంగంలో ఇండియా పేరును  చాలాసార్లు ప్రస్తావించారు.  ఆర్టికల్‌‌ 370 రద్దును ఆయన పదేపదే  విమర్శించారు.

త్రివిధ దళాలకు మెగాబాస్‌

నేషనల్​ సెక్యూరిటీ విషయంలో రాజీపడబోమన్న  ప్రధాని నరేంద్ర మోడీ.. మిలిట్రీకి సంబంధించి అతి పెద్ద నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలోనే దేశానికి  చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాప్​(సీడీఎస్​)ను నియమించబోతున్నట్లు తెలిపారు.  త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​​ మధ్య కోఆర్డినేషన్​ మరింత పెంచడమే లక్ష్యంగా, ఆ మూడు దళాల చీఫ్​లకు బిగ్​బాస్​గా సీడీఎస్ పనిచేస్తారు. ప్రధానమంత్రికి మిలిట్రీ అడ్వైజర్​గానూ వ్యవహరిస్తారు. సెక్యూరిటీకి సంబంధించి దేశం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​ మధ్య కోఆర్డినేషన్​ పెరగాల్సిన అవసరం ఉందన్న మోడీ..‘‘ఓ మేజర్​ అనౌన్స్​మెంట్​ చేయబోతున్నా’’అంటూ ఈ ప్రకటన చేశారు.

కార్గిల్​ వార్​తో ఈ ప్రపోజల్..​

మిలిట్రీ సంస్కరణల్లో మైలురాయిగా భావించే సీడీఎస్​ పోస్టు ఏర్పాటు.. 20 ఏండ్లుగా ప్రపోజల్​ దశలోనే ఉండిపోయింది. 1999లో నాటి కార్గిల్​ వార్​ అనుభవాల దృష్ట్యా సెక్యూరిటీ సిస్టమ్​లో మార్పులకు సంబంధించి కె.సుబ్రమణ్యం నేతృత్వంలో హైలెవల్​ కమిటీ ఏర్పాటైంది. దేశానికి ‘చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​’ ఉండాల్సిందేనని ఆ కమిటీ ప్రతిపాదించింది. తర్వాతి కాలంలో కేబినెట్​ మంత్రులతో కూడిన పలు కమిటీలు కూడా ఆ ప్రపోజల్​ను సమర్థించాయి. 2012లో ఏర్పాటైన నరేశ్​ చంద్ర టాస్క్​ ఫోర్స్​ కూడా సీడీఎస్​ అవసరాన్ని గట్టిగా నొక్కిచెప్పింది. ప్రభుత్వాలేవీ ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం మూడు దళాల మధ్య సమన్వయం కోసం ‘చైర్మన్​ ఆఫ్​ ది చీఫ్స్​ ఆఫ్​ స్టాఫ్​ కమిటీ(సీఓఎస్​సీ)’ అనే వ్యవస్థ ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​ చీఫ్​లు సభ్యులుగా ఉండే ఈ కమిటీలో సీనియర్​ ఆఫీసర్​ చైర్మన్​గా వ్యవహరిస్తారు. ఇప్పుడా బాధ్యతల్ని ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా నిర్వహిస్తున్నారు. కొత్తగా నియామకం కానున్న సీడీఎస్​ను మూడు దళాల్లోని ఏదో ఒక విభాగం నుంచి ఎన్నుకోనున్నారు. మూడు దళాల్లోని సీనియర్‌‌ అధికారి సీడీఎస్​గా ఎంపికయ్యే అవకాశముంది. 20 ఏండ్ల నాన్చివేతకు ఫుల్​స్టాప్​ పెడుతూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని డిఫెన్స్​ వర్గాలు స్వాగతించాయి.

త్రివిధ దళాల సమన్వయానికి సీడీఎస్

నేషనల్​ సెక్యూరిటీ విషయంలో రాజీపడబోం. త్వరలోనే దేశానికి చీఫ్​ ఆఫ్ ​డిఫెన్స్ ​స్టాప్ (సీడీఎస్​)ను నియమించబోతున్నాం. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​ మధ్య కోఆర్డినేషన్​ పెంచడమే లక్ష్యంగా, ఆ మూడు దళాల చీఫ్​లకు బిగ్​బాస్​గా సీడీఎస్​ పనిచేస్తారు. ప్రధానికి మిలిటరీ అడ్వైజర్​గానూ వ్యవహరిస్తారు.

కలల్ని నెరవేర్చడమే లక్ష్యం

గడిచిన ఐదేండ్లూ ప్రజల అవసరాలు తీర్చే పనిలో సక్సెస్​ అయ్యాం. ఇక వచ్చే ఐదేండ్లూ ప్రజల కలలు, ఆకాంక్షల్ని నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకెళతాం.

పటేల్‌‌ కలల్ని నిజం చేశాం

కొత్త ప్రభుత్వం వచ్చి 10 వారాలైనా కాలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌ 370, 35-ఏను రద్దు చేసి

సర్దార్‌‌ వల్లభాయ్‌‌ పటేల్‌‌ కన్న కలల్ని నిజం చేశాం. 70 ఏళ్లల్లో చేయలేని పనిని మేము 70 రోజుల్లోనే చేసి చూపించాం.

దేశంలో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను అభివృద్ధి చేయడానికి వంద లక్షల కోట్లను ఖర్చుపెడతాం.  మన ఎకానమీ  ఐదు ట్రిలియన్‌‌ అమెరికన్‌‌ డాలర్లకు చేరుకోవాలన్నదే టార్గెట్‌‌. చాలా మంది ఇది సాధించడం కష్టమంటున్నారు.  కష్టమైన పనులు మనం చేయకుంటే మనమెప్పుడు అభివృద్ధి సాధిస్తాం.  రెండు ట్రిలియన్‌‌ అమెరికన్‌‌ డాలర్ల ఆర్ధికవ్యవస్థకు చేరుకోవడానికి మనకు 70  ఏళ్లు పట్టింది.  గత ఏడాదిలోనే మనం ట్రిలియన్‌‌ అమెరికన్‌‌ డాలర్లను  యాడ్‌‌ చేయగలిగాం.   ఈ నమ్మకంతోనే వచ్చే ఐదేళ్లలో ఐదు ట్రిలియన్‌‌ అమెరికన్‌‌ డాలర్లకు మన ఎకానమీ చేరుకుంటుందన్న నమ్మకం నాకు కలిగింది.

జల్‌‌ జీవన్‌‌ మిషన్‌‌తో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు

జల్‌‌జీవన్‌‌ మిషన్‌‌ ద్వారా 2024 నాటికి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తామని ప్రధాని మోడీ అన్నారు. 3.5లక్షల కోట్ల వ్యయంతో ఈ మిషన్‌‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మరి కొద్ది వారాల్లో ఇండియాను ఓపెన్‌‌ డెఫకేషన్‌‌ ఫ్రీ (బహిరంగ మలవిసర్జన రహితం)గా ప్రకటిస్తామని, రాష్ట్ర, గ్రామాల్లోని స్థానిక సంస్థల వల్లే ఇది సాధ్యమైందని మోడీ చెప్పారు. ఇప్పటికీ దేశంలో సగానికిపైగా కుటుంబాలకు తాగునీరు అందుబాటులో లేదన్నారు. చాలా మంది మహిళలు మైళ్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గత 70 ఏళ్లలో నీటి సంరక్షణకు తీసుకున్న చర్యల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా కష్టపడాలని, అందుకే నీటికి సంబంధించిన మంత్రివర్గాలన్నింటినీ కలిపి ‘జలశక్తి’ మినిస్ట్రీని ఏర్పాటు చేశామని చెప్పారు. “ నీరు లేకపోతే.. ప్రకృతి ఆగిపోతుంది.. అది వినాశనానికి దారి తీస్తుంది” అని తమిళనాడుకు చెందిన తిరువళ్లవార్‌‌‌‌ చెప్పారని గుర్తు చేశారు. జల్‌‌ జీవన్‌‌ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని.. స్వచ్ఛ ఇండియా మిషన్‌‌ లాగానే ప్రతి ఒకరు దీని కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్‌‌పై..

పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ సింగిల్‌‌ యూజ్‌‌ ప్లాస్టిక్‌‌ను పక్కనపెట్టాలి. వ్యాపారులు కస్టమర్లకు పర్యావరణహిత బ్యాగులు ఇవ్వాలి. అక్టోబర్‌‌‌‌ 2 గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరిశ్రమలు, స్టార్టప్‌‌లు ప్లాస్టిక్‌‌ రీసైక్లింగ్‌‌కు సాయపడాలి.

అవినీతిపై..

అవినీతి అన్నది ఒక వ్యాధి.  దాన్ని పూర్తిగా  తొలగించాల్సిందే.  టెక్నాలజీని వాడడం వల్ల దాన్ని రూపుమాపవచ్చు.

టెర్రరిజంపై..

ప్రపంచశాంతికి ఇండియా కంట్రిబ్యూట్‌‌ చేయాలి.  టెర్రరిజాన్ని రూపుమాపడానికి మనం కీలకమైన పాత్ర పోషించాలి.

రైతులకు..

రైతులు రసాయన ఎరువులు వాడకుండా భూమాతను కాపాడాలి.

టూరిజంపై..

ప్రతి ఒక్కరూ 2022 కల్లా దేశంలోని 15 టూరిస్టు ప్లేసుల్ని విజిట్‌‌ చేయాలి. ప్రతి ఒక్కరు  ఏడాదిలో  ఏడు నుంచి పది రోజులపాటు దేశంలోని ఏదో ఒకప్రాంతానికి  వెకేషన్‌‌కు వెళ్లాలి. దేశంలోని టూరిస్టు  ప్రాంతాలకు  పిల్లల్ని తీసుకెళ్లాలని  మధ్యతరగతి, అప్పర్‌‌ మిడిల్‌‌ క్లాస్‌‌ పేరెంట్స్‌‌ను కోరుతున్నా.

Latest Updates