‘ఆవు’ అంటే… అదిరి పడతారేం: మోడీ


‘ఆవు’ అంటే… అదిరి పడతారేం
అదిలేని గ్రామాలను ఊహించగలమా?
‘ గో రక్షణ’పై  విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని

‘ఆవు, ఓమ్ అనే పేర్లు వినబడితే చాలు.. కొంతమంది ఉలిక్కి పడతారు. రోమాలు నిక్కబొడుచుకుంటాయ్.. దేశం 16 వ శతాబ్దంలోకి వెళ్లిపోయిందని గగ్గోలు పెడతారు. కానీ జంతువుల ప్రస్తావన లేని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఊహించగలమా?’ అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్​లోని మథురలో నేషనల్​ఎనిమల్​ డిసీజ్​ కంట్రోల్​ ప్రోగ్రాం(ఎన్ఏడీసీపీ) సహా పలు రైతు సంక్షేమ పథకాలను మోడీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘మన ఆర్థిక వ్యవస్థలో జంతువులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశం కొత్త తీరాలకు చేరాలన్నా, మరింత బలోపేతం కావాలన్నా పకృతిని, ఆర్థిక ప్రగతిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్​చేసుకుంటుండాలి’ అన్నారు.

జంతువుల రక్షణ కోసం ప్రవేశ పెడుతున్న ఈ కొత్త స్కీంలో భాగంగా.. ఐదేళ్లలో అంటే 2024లోగా 50 కోట్ల జంతువుల(ఆవులు, గేదెలు, మేకలు, గొర్లు, పందులు)కు వ్యాక్సినేషన్​ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ పథకానికి సుమారు రూ.12,652 కోట్లు ఖర్చవుతుందని అంచనా.. ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ఆయన వివరించారు. కార్యక్రమం తర్వాత స్థానిక రైతులు, వెటర్నరీ డాక్టర్లతో ప్రధాని మాట్లాడారు. ‘స్వచ్ఛతా హి సేవ’లో పాల్గొన్న ఆడవాళ్లను కలిసిన మోడీ.. చెత్తలో ప్లాస్టిక్​ వ్యర్థాలను వేరు చేయడానికిగల ప్రాధాన్యతను వారికి వివరించారు. ప్లాస్టిక్​ను వేరు చేయడం ద్వారా పరోక్షంగా ఆవులు, జంతువుల ప్రాణాలను కాపాడుతున్నారని వారిని కొనియాడారు.

ప్లాస్టిక్​ను దూరంపెట్టండి

అంతకుముందు ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. స్థానిక సంప్రదాయంలో ‘రాధే, రాధే’ అంటూ ప్రజలను గ్రీట్​చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడిన మోడీ తన ప్రసంగంలో సింగిల్​యూజ్​ప్లాస్టిక్​ను నిషేధించాలని, పరిశుభ్రతను పాటించాలని ప్రజలను కోరారు.

స్వామి వివేకానంద ప్రసంగం..

సెప్టెంబర్​ 11 కు రెండు ప్రత్యేకతలు ఉన్నాయని.. ఒకటి అమెరికాలోని ట్విన్​ టవర్స్​కూల్చివేత దుర్ఘటన కాగా మరొకటి చికాగో సిటీలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగమని మోడీ చెప్పారు. ఆ ప్రసంగం ద్వారా మొత్తం ప్రపంచానికే మన దేశ ఆచారాలు, సంప్రదాయాన్ని స్వామి పరిచయం చేశారని అన్నారు. నేషనల్​ ఆర్టిఫిషియల్​ ఇన్​సెమినేషన్​ ప్రోగ్రాం(ఎన్ఏఐపీ) ను కూడా ప్రారంభించారు.  ఈ  కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

ఎన్‌‌ఏడీసీపీ అంటే?

     నేషనల్​ ఎనిమల్​ డిసీజ్ ​కంట్రోల్​ ప్రోగ్రాం(ఎన్ఏడీసీపీ)

     పశువుల కాళ్లకు, నోటికి వచ్చే బ్రూసెల్లోసిస్‌‌ అనే వ్యాధి రాకుండా  ఉండేందుకు  ప్రోగ్రామ్‌‌ను  అమలుచేస్తున్నారు.

     వచ్చే 2024 నాటికి ఈ పథకం కింద సుమారు 50 కోట్ల పశువులు, గొర్రెలు, మేకలు, పందులకు వ్యాక్సినేషన్‌‌ వేస్తారు.

     ఈ పథకానికి అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తుంది.

    స్కీమ్‌‌కు  రూ. 12 ,652 కోట్లను కేంద్రం కేటాయించింది.

Latest Updates