టెస్టు కిట్స్ ఉన్నా.. రోజుకు ల‌క్ష టెస్టులు చేయ‌రేం?

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ప్ర‌ధాని మోడీ వేగంగా స్పందించాల‌ని కోరారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చిన్న చిన్న అడ్డంకులు తొల‌గించి, భారీగా టెస్టుల చేయాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు భారీగా ర్యాండ‌మ్ టెస్టింగ్ చేయ‌డం ఒక్క‌టే ఉత్త‌మ మార్గ‌మ‌ని నిపుణులంతా చెబుతున్నార‌ని మ‌రోసారి గుర్తు చేశారాయ‌న‌. ఇందుకు అవ‌స‌ర‌మైన కిట్స్ అందుబాటులో ఉన్నప్ప‌టికీ చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌డంలో కేంద్రం విఫ‌ల‌మ‌వుతోంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం రోజుకు 40 వేల టెస్టులు మాత్ర‌మే జ‌రుగుతున్నాయ‌ని, ఆ సంఖ్య‌ను ల‌క్ష‌కు పెంచాలంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు వీలైనంత ఎక్కువగా టెస్టులు చేయడం ఒక్క‌టే మార్గ‌మ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. కరోనా టెస్ట్ లు ఎక్కువ చేయకపోవటం కారణంగా కేసులు బయటపడటం లేదని ఫలితంగా కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తుందని చెప్పారు. స్పీడ్ గా కరోనా టెస్ట్ లు చేయటం వల్ల కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లందరినీ గుర్తించి మరింత వ్యాప్తి చెందకుండా వారిని ఐసోలేషన్ చేయాలని కోరారు.

Latest Updates