పీఎంసీలో 21 వేల నకిలీ అకౌంట్లు

ముంబైపంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్‌‌ హెచ్‌‌డీఐఎల్‌‌ గ్రూప్‌‌ దివాలా తీసిన విషయాన్ని దాచిపెట్టడానికి ఎన్నో గిమ్మిక్కులు చేసినట్టు వెల్లడైంది. హెచ్‌‌డీఐఎల్‌‌ డిఫాల్ట్ అయిన విషయాన్ని బయటకు పొక్కకుండా.. 21 వేలకు పైగా నకిలీ అకౌంట్లను సృష్టించినట్టు ముంబై పోలీసు ఆర్థిక నేరాల వింగ్(ఈఓడబ్ల్యూ) తెలిపింది. హెచ్‌‌డీఐఎల్ గ్రూప్‌‌కు చెందిన 44 లోన్ అకౌంట్లను 21 వేలకు పైగా నకిలీ లోన్ అకౌంట్లతో రీప్లేస్ చేసినట్టు తెలిపింది. హౌసింగ్ డెవలప్‌‌మెంట్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(హెచ్‌‌డీఐఎల్)కు చెందిన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ వాధ్వాన్, ఆయన కొడుకు సారంగ్ వాధ్వాన్‌‌లను కస్టడీ కోరుతూ ఈ వివరాలను ఈఓడబ్ల్యూ కోర్టుకు సమర్పించింది. వీరికి ఈ నెల 9 వరకు రిమాండ్ విధించింది కోర్టు. హెచ్‌‌డీఐఎల్ గ్రూప్, పీఎంసీ బ్యాంక్ సీనియర్ అధికారులపై ఈఓడబ్ల్యూ ఎఫ్‌‌ఐఆర్ రిజిస్టర్ చేసింది. దీనిలో బ్యాంక్‌‌ మాజీ ఎండీ జాయ్ థామస్‌‌ కూడా ఉన్నారు. బ్యాంక్‌‌ను రూ.4,355.43 కోట్ల నష్టాలు పాలుచేయడంతో వీరిపై కేసు పెట్టింది.

హెచ్‌‌డీఐఎల్ గ్రూప్‌‌కు సంబంధించిన లోన్‌‌ అకౌంట్లను రీప్లేస్ చేస్తూ పీఎంసీ బ్యాంక్‌‌  సృష్టించిన ఈ నకిలీ అకౌంట్లను 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌‌‌‌బీఐకి సమర్పించిన లోన్ అకౌంట్లలో పేర్కొంది. అయితే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌‌లో మాత్రం ఈ లోన్స్ వివరాలు లేనట్టు ఈఓడబ్ల్యూ చెప్పింది. జాయ్ థామస్‌‌తో పాటు బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌‌లందరికీ వీటి గురించి తెలుసని పేర్కొంది. ఇలా మోసం చేయడంలో వాధ్వాన్‌‌లు కీలక పాత్ర పోషించినట్టు తెలిపింది. ఈ ఆపరేషన్ల గురించి తెలసుకోవడం కోసం వీరి కస్టడియల్ ఇంటరాగేషన్ తప్పనిసరని ఈఓడబ్ల్యూ పేర్కొంది.  జాయ్ థామస్‌‌ను శుక్రవారమే అరెస్ట్ చేశారు.

2 రోల్స్ రాయిస్, 2 రేంజ్ రోవర్స్, 1 బెంట్లీ సీజ్…

కంపెనీకి చెందిన రూ.3,500 కోట్ల ప్రాపర్టీలను ఈఓడబ్ల్యూ సీజ్ చేసింది. గత వారం ఈ బ్యాంక్‌‌పై ఆర్‌‌‌‌బీఐ చర్యలు తీసుకోవడంతో పీఎంసీ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పీఎంసీ బ్యాంక్‌‌లో రూ.4,355 కోట్ల మోసానికి పాల్పడినందుకు గాను హెచ్‌‌డీఐఎల్ ప్రమోటర్లపై ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ వీరిని విచారణ చేస్తోంది. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో రైడ్స్ చేసింది.   రాకేష్ వాధ్వాన్, సారంగ్ వాధ్వాన్‌‌లకు చెందిన 12 హై ఎండ్ కార్లను ఈడీ సీజ్ చేసింది. ఈ వెహికిల్స్‌‌లో రెండు రోల్స్ రాయిస్, రెండు రేంజ్ రోవర్స్, ఒకటి బెంట్లీ ఉన్నట్టు తెలిసింది. హెచ్‌‌డీఐఎల్‌‌తో సంబంధం ఉన్న 18 ఇతర కంపెనీల వివరాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది. బాంద్రా వెస్ట్‌‌లో ఉన్న ఉన్న వాధ్వాన్ హౌస్, బాంద్రా(ఈస్ట్) లో ఉన్న హెచ్‌‌డీఐఎల్ హెడ్ ఆఫీసుపై ఈ రైడ్స్ జరిగాయి.

పైసలిచ్చినంఇళ్లు కట్టలే.. ఆదుకోండి సార్.. ప్రధానికి లెటర్

మరోవైపు దివాలా తీసిన హెచ్‌‌డీఐఎల్ రియాల్టర్‌‌‌‌కు చెందిన 450 మంది గృహ కొనుగోలుదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ సంక్షోభం నుంచి తమల్ని గట్టెక్కించాలని కోరారు. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. తొమ్మిదేళ్లుగా పనులు ముందుకు కదలని సబ్‌‌అర్బన్ ములుంద్ ప్రాజెక్ట్‌‌ కోసం హెచ్‌‌డీఐఎల్‌‌కు మొత్తంగా రూ.350 కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నారు.   ఈ ప్రాజెక్ట్‌‌ను 2010లో ప్రారంభించారని, అప్పటి నుంచి బుకింగ్స్‌‌ను కొనసాగించారని పేర్కొన్నారు. కానీ గత తొమ్మిదేళ్లలో కూడా కేవలం 18 అంతస్తులను మాత్రమే నిర్మించారని గృహ కొనుగోలుదారులు వాపోయారు. రెండో దశ పనులేమీ ఇంకా ప్రారంభించలేదని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌‌ కోసం రియాల్టర్లు అలహాబాద్ బ్యాంక్, జే అండ్ కే బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ నుంచి రూ.175 కోట్లు తీసుకున్నారని, మరో రూ.525 కోట్లను హెచ్‌‌డీఐఎల్ సేకరించిందని ఈ లేఖలో పేర్కొన్నారు. కానీ ఈ నగదును దారి మళ్లించినట్టు చెప్పారు. హెచ్‌‌డీఐఎల్‌‌కు చెందిన మరికొన్ని ప్రాజెక్ట్‌‌లు నహూర్‌‌‌‌లోని మేజిస్టిక్ టవర్‌‌‌‌, పాల్ఘర్‌‌లోని పారడైజ్ సిటీలు కూడా నిలిచిపోయాయి.

Latest Updates