BSNL, MTNL కోసం సర్కార్​ కొత్త ప్లాన్

న్యూఢిల్లీనష్టాల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వరంగ టెలికం కంపెనీలు బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌-,ఎంటీఎన్‌‌ఎల్‌‌లను తిరిగి గాడిలో పెట్టే ప్లాన్‌‌కు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇచ్చినట్టు తెలిసింది. పీఎంఓ కార్యాలయంలో జరిగిన అత్యున్నతస్థాయి మీటింగ్‌‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం.. ఈ రెండు కంపెనీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి 4జీ స్పెక్ట్రంను కేటాయిస్తారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి వాలంటరీ రిటైర్‌‌మెంట్‌‌ స్కీమ్‌‌ను (వీఆర్‌‌ఎస్‌‌) అమలు చేస్తారు. రిటైర్‌‌మెంట్‌‌ వయసును 58 ఏళ్లకు తగ్గిస్తారు. ఈ రెండు కంపెనీలను విలీనం, భూమి వంటి ఆస్తుల అమ్మకం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడం, బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ల అప్పుల బదిలీ వంటి ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని పీఎంఓ నిర్ణయించింది. అయితే భూమి, టెలికం పరికరాలను మాత్రం అమ్ముతారు. అమ్మకం ప్రక్రియను బీఎన్‌‌ఎన్‌‌ఎల్‌‌, డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికం (డాట్‌‌), డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అండ్‌‌ పబ్లిక్‌‌ అసెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (దీపమ్‌‌) అధికారులతో కూడిన జాయింట్‌‌ కమిటీ పరిశీలిస్తుంది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం కోసం వీటిని కేంద్ర కేబినెట్‌‌కు పంపించామని బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ వర్గాలు వెల్లడించాయి. బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌, ఎంటీఎన్‌‌ఎల్‌‌లకు రివైవల్‌‌ ప్యాకేజీ ఇవ్వడం వల్ల ఖజానాకు ఎంతో నష్టం కలుగుతుందని ఆర్థికమంత్రిత్వశాఖ ఆక్షేపించినా, పీఎంఓ మాత్రం గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇవ్వడం గమనార్హం. డాట్‌‌ సెక్రెటరీ అన్షుప్రకాశ్‌‌, బీఎస్‌‌ఎన్‌‌ఎల్ చైర్మన్‌‌ పీకే పుర్వార్‌‌ పీఎంఓలో జరిగిన మీటింగ్‌‌కు వచ్చారు. 4జీ స్పెక్ట్రమ్‌‌ కేటాయింపును 100 శాతం క్యాపిటల్‌‌ కేటాయింపుగా ప్రభుత్వం పరిగణించాలని ప్రతిపాదించారు.

అధిక మొత్తం జీతాలకే..

ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న ఈ రెండు టెల్కోల అప్పులను తగ్గించడానికి, ఆదాయాలను పెంచడానికి 4జీ స్పెక్ట్రమ్‌‌ను కేటాయించాలనే ప్రతిపాదనను నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలాకాలంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం అన్ని కంపెనీలూ 4జీ సేవలు అందిస్తుండగా, ప్రభుత్వ టెల్కోలు మాత్రం వెనుకబడ్డాయి. వీఆర్ఎస్‌‌ అమలు వల్ల బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ రూ.6,365 కోట్లు, ఎంటీఎన్‌‌ఎల్‌‌ రూ.2,120 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 4జీ రేడియో తరంగాలు పొందడానికి బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌కు రూ.14 వేల కోట్లు, ఎంటీఎన్‌‌ఎల్‌‌కు రూ.ఆరు వేల కోట్లు కావాలి. ఆదాయంలో అత్యధిక మొత్తం జీతాలకే పోవడంతో ఈ రెండు కంపెనీలు అప్పుల పాలయ్యాయి. పైగా జియో వచ్చాక టారిఫ్‌‌ల యుద్ధం మొదలవడంతో మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. రెండు, మూడు నెలలపాటు జీతాల చెల్లింపు ఆలస్యమయింది.  కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో బీఎస్‌‌ఎన్‌‌ఎల్ మొబైల్ టవర్స్ మూతపడ్డాయి. వెయ్యికి పైగా మొబైల్ టవర్లు, 500 టెలిఫోన్ ఎక్సైంజీలు కార్యకలాపాలు సాగించడం లేదని కమ్యూనికేషన్ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇటీవల లోక్‌‌సభకు రాత పూర్వకంగా తెలియజేశారు. బీఎస్‌‌ఎన్‌‌ఎల్ మొత్తం మార్కెట్ షేరు 2017 మార్చి నుంచి 2019 మార్చి మధ్య కాలంలో స్వల్పంగా పెరుగగా.. ఎంటీఎన్‌‌ఎల్ మార్కెట్ షేరు తగ్గింది. 2018-–19 ఏడాదిలో బీఎస్‌‌ఎన్‌‌ఎల్ 53.64 లక్షల మంది సబ్‌‌స్క్రైబర్లు పోర్ట్‌‌ ఇన్ అవగా.. 28.27 లక్షల మంది పోర్ట్ అవుట్స్ అయ్యారు. ఇదే ఏడాదిలో ఎంటీఎన్‌‌ఎల్‌‌కు 10,195 పోర్ట్‌‌ ఇన్‌‌లు నమోదవగా.. 1.35 లక్షల పోర్ట్‌‌ అవుట్‌‌లు ఉన్నాయి. 2009-–10 ఆర్థిక సంవత్సరం నుంచి బీఎస్‌‌ఎన్‌‌ఎల్, ఎంటీఎన్‌‌ఎల్‌‌ కంపెనీలు నష్టాలను నమోదు చేస్తూనే ఉన్నాయి.

Latest Updates