
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి భారీషాక్ తగిలింది. నీరవ్ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ నీరవ్ సోదరి పూర్వి, ఆమె భర్త మైయాంక్ మెహతా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను ఇస్తామంటూ అప్రూవర్‌గా మారేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. దీంతో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ కు భారీ షాక్ తగిలింది.
PNB స్కాం, నీరవ్ నుంచి తమను దూరం చేయాలని కోరుతూ పూర్వి మోడీ, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని, సాక్ష్యాలను అందించేందుకు అంగీకరించారు. అతని నేరపూరిత కార్యకలాపాలు మూలంగా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారు కోర్టును ఆశ్రయిండంతో ప్రాసిక్యూషన్ సాక్షులుగా ముంబైలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు అనుమతించింది. క్షమాపణ తెలిపిన తర్వాత నీరవ్ చెల్లెలు పూర్వి మోడీ, ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు తెలిపింది. ప్రస్తుతం బెల్జియం పౌరసత్వంతో ఆదేశంలో ఉన్న పూర్విపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అభియోగాలు నమోదు చేసింది.