బెంగాల్‌లో పోలీసులపై దాడి

  • ఇద్దరికి తీవ్రగాయాలు
  • రెండు వెహికిల్స్‌ ధ్వంసం

కోల్‌కతా: హౌరాలోని హాట్‌స్పాట్‌లో గుంపులుగా తిరుగుతున్న కొందరినీ చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై గుర్తు తెలియన వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. రెండు పోలీసు వెహికిల్స్‌ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు సమీపంలోని హౌరాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అధికారులు దాన్ని హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ఆ ఏరియాల్లో ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలని బయటకు రావొద్దని హెచ్చరించారు. అయినప్పటికీ కొంత మంది వినకుండా బయటకు వచ్చి సోషల్‌ డిస్టెంసింగ్ పాటించకుండా.. లాక్‌డౌన్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లతో దాడి చేయడంతో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుల నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసులు దగ్గర్లోని పోలీస్‌పోస్ట్‌లో తలదాచుకోగా.. పోస్ట్‌కు దగ్గర్లో ఉన్న రెండు వెహికిల్స్‌ను పూర్తిగా ధ్వంసం చేశారని పోలీసు అధికారులు చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించామన్నారు. గాయపడిన వారిని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నట్లు చెప్పారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు.

Latest Updates