డ్యూటీల చేరనియ్యలే..డిపో గేట్ల దగ్గరే కార్మికుల అరెస్ట్

52 రోజుల సమ్మెను విరమించి మంగళవారం విధుల్లో చేరేందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. డ్యూటీలో చేర్చుకోవాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రానందున వెనుదిరగాలని చెప్పారు.  డిపోల ఎదుట ఉదయం నుంచే భారీగా మోహరించిన పోలీసులు,  వచ్చినవారిని వచ్చినట్టే అరెస్ట్​ చేసి ఠాణాలకు తరలించారు. ఈ సందర్భంగా అనేక చోట్ల మహిళా కార్మికులు ఆవేదనతో కన్నీరుపెట్టుకున్నారు. కొందరు కార్మికులైతే పోలీసులు, డిపో మేనేజర్ల కాళ్లు మొక్కి వేడుకున్న తీరు కలచివేసింది.

కరీంనగర్ రీజియన్​ పరిధిలోని10 డిపోలకు ఉదయం నుంచే కార్మికులు విధుల్లో చేరేందుకు వచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో సుమారు 3 వేల మంది కార్మికులు ఆయా డిపోల పరిధిలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్ట్​ చేసి, వివిధ ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కరీంనగర్ 2 డిపోకు చెందిన పద్మ అనే కండక్టర్, డ్రైవర్ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వన్ డిపోకు చెందిన మెకానిక్ కృష్ణయ్య అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. కార్మికులకు మద్దతుగా డిపోల వద్ద ధర్నా చేపట్టిన సీపీఐ, సీపీఎం నాయకులను సైతం పోలీసులు అరెస్టు చేశారు.

ఆదిలాబాద్‍రీజియన్​ పరిధిలో పొద్దున ఆరు గంటలకే డిపోల వద్దకు చేరుకున్న కార్మికులను పోలీసులుఅడ్డుకున్నారు. దీంతో ఆదిలాబాద్‍, భైంసా, నిర్మల్‍, ఆసిఫాబాద్‍డిపోల వద్ద కార్మికులు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‍స్టేషన్లకు తరలించారు.

నిజామాబాద్ జిల్లాలోని ఆరు డిపోల ముందు మోహరించిన పోలీసులు, విధులకు వచ్చిన కార్మికులను అడ్డుకున్నారు. తమను డ్యూటీలో చేరేందుకు అనుమతించాలంటూ నిజామాబాద్ 1 డిపో వద్ద మహిళా కార్మికులు డీఎం ఆనంద్ కాళ్లపై పడి ఏడ్చిన తీరు కలచివేసింది. నిజామాబాద్ 2 డిపో వద్ద  డీఎం ను కార్మికులు బతిమాలి వినతి పత్రాలిచ్చినా తీసుకోలేదు.  అన్ని డిపోల వద్ద 98 మందిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్లకు తరలించారు.

వరంగల్​ జిల్లాలోని అన్ని డిపోల వద్ద ఉదయం నుంచే పోలీసులు మోహరించారు. సుమారు 20 మంది మహిళా కార్మికులు హన్మకొండ బస్​స్టేషన్​లో యూనిఫాం ధరించి వచ్చి కూర్చోగా, పోలీసులు అరెస్ట్​ చేసి బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్​లో తరలించారు. మరికొందరిని కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో అరెస్ట్​ చేసి పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లారు. 52 రోజుల సమ్మె తర్వాత విధుల్లో చేరేందుకు వస్తే అరెస్ట్​ చేయడం సరికాదంటూ మహిళా కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు.

నల్గొండ, యాదాద్రి, సూర్యపేట జిల్లాల్లోని కార్మికులంతా తాము సమ్మెను విరమించామని, బేషరతుగా డ్యూటీలో చేర్చుకోవాలని కోరుతూ వినతిపత్రాలతో ఉదయమే డిపోల వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు మెయిన్‌‌‌‌‌‌‌‌గేటు వద్దే అడ్డుకొని అరెస్ట్‌‌‌‌‌‌‌‌చేసి పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. యాదగిరిగుట్టలో కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.

ఖమ్మం జిల్లాలోనూ డ్యూటీలకు చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు డిపోల్లోకి అడుగుపెట్టనివ్వలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో యూనియన్​ కార్యాలయానికి పోలీసులు తాళం వేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం డిపోకు  మూడు  వైపులా  సుమారు  200  మీటర్ల  దూరంలోనే పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించలేదు. తమను విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే దూకి చస్తామని మహిళా కార్మికులు ఖమ్మం కాంగ్రెస్ ​కార్యాలయం పై కి ఎక్కి నిరసన తెలిపారు. మణుగూరు, సత్తుపల్లి, భద్రాచలం డిపోల వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

మహబూబ్​నగర్ రీజియన్​ పరిధిలో సోమవారం సాయంత్రం నుంచే కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.  మంగళవారం ఉదయం విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. తెలంగాణలో  పాలన గాడితప్పిందని, నియంత పాలనలో రాష్ట్రాన్ని  ఓపెన్​జైలులా మార్చారని ఎమ్మార్పీఎస్ ​వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఫైర్​అయ్యారు.  కొల్లాపూర్ లో ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఆయనను పోలీసులు హౌజ్​అరెస్ట్ చేశారు. మహబూబ్​నగర్​లో10 మంది మహిళా కండక్టర్లు ప్రయాణికులుగా బస్సులో ఎక్కి డిపోలోకి  వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అన్ని డిపోల వద్ద కార్మికులను అరెస్ట్​ చేసి ఠాణాలకు తరలించారు.

హైదరాబాద్​లో స్వచ్ఛందంగా డ్యూటీలో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్ట్​ చేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గ్రేటర్ పరిధిలోని 29 డిపోల ముందు ఉదయం ఐదు గంటల నుంచే డ్యూటీకు  హాజరయ్యేందుకు కార్మికులు క్యూ కట్టారు. సమ్మె విరమిస్తున్నట్లు లేఖ రాసి డిపో మేనేజర్ కు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వీరిని ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకున్నారు. డిపో మేనేజర్ ను కలిసే అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ప్రతి డిపో ఎదుట పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు.   తమను విధుల్లోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ముషీరాబాద్ లో వన్, టూ, త్రీ డిపో ల ముందు కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్ట్  చేశారు. దిల్ సుఖ్ నగర్, ముషీరాబాద్, హయత్ నగర్, కూకట్ పల్లి డిపోల వద్ద మహిళా కండక్టర్లను బలవంతంగా పోలీస్ వ్యాన్లలో ఎక్కించగా పలువురు కన్నీరు మున్నీరయ్యారు.

Latest Updates