చిన్నారి కిడ్నాప్..10 గంటల్లోనే పట్టుకున్నారు

police-chasing-child-kidnap-case-just-10-hours

హైదరాబాద్‌‌,వెలుగు: లంగర్ హౌస్ లో కలకలం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. పోలీసులు24 గంటల్లో  కేసును ఛేదించి చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ప్రశాంత్ నగర్ లో ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని బుధవారం ఓ దుండగుడు ఎత్తుకుపోయిన సంగతి తెలిసిందే. ఈకిడ్నాప్ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడి ఆచూకీని వికారాబాద్ జిల్లా కొడంగల్ లో గుర్తించారు. గురువారం కిడ్నాపర్ ను అరెస్టు చేసిన పోలీసులు.. రాత్రి ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను లంగర్ హౌస్ పోలీసులు వెల్లడించారు.

ఇంటి దగ్గర ఆడుకుంటుంటే..

లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌‌నగర్‌‌  గ్రౌండ్స్ సమీపంలో ఉండే చిరంజీవి,జ్యోతి దంపతుల కూతురు వైష్ణవి(5) గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది. బుధవారం  స్కూల్ నుంచి తిరిగి వచ్చిన వైష్ణవి ఇంటి దగ్గర ఆడుకుంటోంది. మధ్యాహ్నం 3గంటల తర్వాత వైష్ణవి అక్కడ లేకపోవడంతో చిరంజీవి, జ్యోతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా వైష్ణవి కనిపించకపోవడంతో వారు లంగర్ హౌస్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.  కేసు నమోదు చేసుకుని లంగర్ హౌస్ పోలీసులు వైష్ణవి కోసం గాలించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌‌ను పరిశీలించారు. అందులో చిన్నారిని ఓ వృద్ధుడు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ప్రశాంత్ నగర్ మెయిన్ రోడ్డుపై వైష్ణవిని తీసుకెళ్తున్న వృద్ధుడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

4 స్పెషల్ టీమ్ లు ఏర్పాటు

ఇంటి దగ్గర ఆడుకుంటూ మిస్సింగ్ అయిన చిన్నారి వైష్ణవిని వృద్ధుడు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. 4 స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసిన పోలీసులు ప్రశాంత్ నగర్ గ్రౌండ్స్ నుంచి మెయిన్ రోడ్ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు. ప్రశాంత్ నగర్ పరిసర ప్రాంతాల్లో చిన్నారితో సంచరించిన వృద్ధుడిని గుర్తించారు. ఫుటేజ్ ఆధారంగా లంగర్ హౌస్ లో 15 నిమిషాల పాటు వృద్ధుడైన ఆ కిడ్నాపర్  తిరిగినట్లు గమనించారు. తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ తో ఆటోడ్రైవర్లు, కిరాణ షాపులు,హోటల్స్ యజమానుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.
చిన్నారిని కిడ్నాప్ చేసిన వృద్ధుడి గురించి ఆరాతీశారు.  బుధవారం రాత్రి వరకు కిడ్నాపర్ కి సంబంధించి ఎలాంటి ఆచూకీ దొరకలేదు.