హంతకుడిని పెళ్లి చేసుకున్న పోలీస్​

అతడో పెద్ద హంతకుడు. ఓ హత్య చేసి జైలు పాలయ్యాడు. మరో 12 దోపిడీలు, హత్యల్లో నిందితుడిగా ఉన్నాడు.

ఆమె ఓ పోలీస్​ కానిస్టేబుల్​. కోర్టులో విచారణకు వచ్చిన అతడిని చూసి మాట కలిపింది. పరిచయం పెరిగి ప్రేమగా మారింది. అతడినే పెళ్లి చేసుకుంది.

ఎవరైనా ఊహిస్తారా నేరస్థులు, పోలీసుల మధ్య ఇలాంటి సంబంధం? కానీ, వాళ్లిద్దరి విషయంలో మాత్రం అదే జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన పాయల్​ అనే కానిస్టేబుల్​, రాహుల్​ థరాసన (30) అనే గ్యాంగ్​స్టర్​ మధ్య నడిచింది ఆ ప్రేమాయణం. మన్మోహన్​ గోయల్​ అనే వ్యాపారి హత్య కేసులో 2014 మే 9న అరెస్టయిన రాహుల్​ను గ్రేటర్​ నోయిడాలోని సూరజ్​పూర్​ కోర్టులో విచారణకు తీసుకొచ్చేవారు. ఆ టైంలో పాయల్​ అక్కడే డ్యూటీ చేస్తుండేది. అతడిని చూసి మాట కలిపింది. అతడితో టచ్​లో ఉండేది. ఆ పరిచయం వాళ్లిద్దరి మధ్యా ప్రేమగా మారింది. ఇటీవలే పాయల్​, రాహుల్​లు పెళ్లి చేసుకున్నారు. ఆ ఫొటోలను తన సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో అవి వైరల్​ అయ్యాయి. ఎక్కడ, ఎప్పుడు పెళ్లి చేసుకున్నది చెప్పలేదు కానీ, ప్రేమతో ఇద్దరం ఒక్కటయ్యామంటూ హంతకుడైన రాహుల్​ పోస్ట్​ పెట్టాడు. అయితే, ఈ పెళ్లి ఫొటోలు చూసిన పాయల్​ పై అధికారులు షాక్​ తిన్నారు. ఆమెపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. సూరజ్​ పూర్​ కోర్టు వద్ద డ్యూటీ తర్వాత గౌతమ్​ బుద్ధ నగర్​ పోలీస్​ స్టేషన్​లో పాయల్​ డ్యూటీ చేసింది. ‘‘ప్రస్తుతం ఆమె ఎక్కడో పనిచేస్తోందో తెలియదు. ఓ నరహంతకుడిని పెళ్లి చేసుకున్న ఆమెపై మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటాం” అని ఎస్పీ రణ్​విజయ్​ సింగ్​ తెలిపారు. ఈ పెళ్లి ఇప్పుడు యూపీ పోలీసులందరిలోనూ పెద్ద చర్చనీయాంశమైంది. కాగా, అనిల్​ దుజంగా అనే గ్యాంగ్​స్టర్​ గ్యాంగ్​లో సభ్యుడని పోలీసులు చెబుతున్నారు. 2008లో తన నేర వృత్తిని ప్రారంభించాడంటున్నారు.

Latest Updates