కర్ఫ్యూ టైంలో షాపు తీసినందుకు రూ. 25 వేల లంచం డిమాండ్

లాక్డౌన్ నిబంధనలకు విరుద్దంగా కోడిగుడ్ల బండి పెట్టాడని.. బండిని తోసేసిన ఘటన మరువకముందే.. అదే ఇండోర్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. షాపులు మూయాల్సిన టైం దాటిన తర్వాత కూడా ఒక గంట ఎక్కువగా షాపు తెరచాడని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ యజమానిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టిన ఘటన జుని ఇండోర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

రమేష్ జగ్వానీ అనే వ్యక్తి ఇండోర్ లో ఐస్‌క్రీమ్ పార్లర్ నడుపుతున్నాడు. అక్కడ లాక్డౌన్ నిబంధనల ప్రకారం షాపులన్నీ రాత్రి 9 గంటలకు మూసివేయాలి. కానీ, జగ్వానీ మాత్రం జూలై 29న రాత్రి 10 గంటల వరకు షాపు తెరచే ఉన్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన కానిస్టేబుళ్లు.. జగ్వానీని దుర్భాషలాడుతూ మాట్లాడారు. పైగా.. స్టేషన్ కు వచ్చి కలవాలని హెచ్చరించారు.

‘బుధవారం రాత్రి ఇద్దరు పోలీసులు నా పార్లర్‌కు వచ్చి నాతో అసభ్యంగా మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు రావాలన్నారు. నేను తర్వాత వస్తాను అని చెప్పినా వినకుండా.. ఇప్పుడే రావాలని పట్టుబట్టారు. దాంతో నేను నా షాపు మూసివేసి వారితో పాటు స్టేషన్ కు వెళ్లాను. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు సబ్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర అగర్వాల్ వచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్ళు ఆయనతో మాట్లాడారు. ఆయన కూడా నన్ను దుర్భాషలాడటం మొదలుపెట్టి.. కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత పోలీసులు నన్ను రూ .25 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేను అంత డబ్బు ఇవ్వలేను. 10,000 రూపాయలు మాత్రమే ఇవ్వగలను అని చెప్పాను. డబ్బులు ఇవ్వడం కోసం నేను నా కొడుకును పిలిపించాను. అతను పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఉన్నాడు. కాసేపటికి సబ్ ఇన్స్పెక్టర్ నన్ను రెండు ఖాళీ కాగితాలపై సంతకం చేయమని కోరాడు. కానీ, నేను అలా చేయటానికి ఒప్పుకోలేదు. దాంతో ఆయన మళ్ళీ నన్ను తిడుతూ.. కొట్టడం ప్రారంభించాడు. సాయంత్రం 6 గంటల తర్వాత నా ఐస్‌క్రీమ్ పార్లర్‌ను తెరిచి ఉంచొద్దని ఆయన నన్ను బెదిరించారు. దాంతో నేను డీఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను’ అని ఆయన చెప్పారు.

ఈ ఘటన గురించి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) హరినారాయణ్ చరి మిశ్రా మాట్లాడుతూ.. ‘ఈ ఘటనలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశాం. తదుపరి దర్యాప్తును డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చేసి.. నివేదిక ఇస్తారు’ అని ఆయన తెలిపారు.

For More News..

కరోనాతో ఉత్తరప్రదేశ్ సాంకేతిక విద్యా మంత్రి మృతి

పంజాబ్ లో దారుణం.. కల్తీ మద్యం తాగి 86 మంది మృతి

అయోధ్య భూమి పూజకు అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం

Latest Updates