అమ్మాయిని ఎరగా వేసారు..జయరాం హత్య కేసులో చార్జిషీట్

police-filed-on-chiguru-pati-jayaram-murder-case

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అమ్మాయిని ఎరగా వేసి, ఇంటికి పిలిపించి, తీవ్రంగా దాడి చేసి జయరాంను హత్య చేసినట్లు అందులో పేర్కొన్నారు. సోమవారం బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో 23 పేజీలతో కూడిన చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందుకోసం 73 మంది సాక్షులను విచారించారు. రాకేశ్ రెడ్డి, ముగ్గురు పోలీసులతోపాటు మరో ఎనిమిది మందిపై అభియోగాలు నమోదు చేశారు. మొదటి నుంచి అనుమానితురాలిగా ఉన్న జయరాం మేనకోడలు శిఖాచౌదరిని 11వ సాక్షిగా చేర్చారు. జయరాం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు సలహాలిచ్చారని చార్జిషీట్​లో పేర్కొన్నారు. నల్లకుంట మాజీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్ స్పెక్టర్ రాంబాబుతోపాటు ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు.

ప్రతి నెల 50 లక్షలు ఇస్తా.. వదిలేయండి

‘‘ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డి ‘హనీ ట్రాప్’కు ప్లాన్ చేసి జనవరి 31న వీణ అనే పేరుతో జయరాంను లంచ్​కు ఆహ్వానించారు. ఇంటికి రాగానే జయరాంపై రాకేశ్ దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. మరో నిందితుడు విశాల్‌ తో కలిసి రూ.4.5 కోట్లకు బాండ్ పేపర్స్ పై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. దీన్నంతా ఫోన్ లో రికార్డ్ చేశారు” అని చార్జిషీట్​లో పోలీసులు పేర్కొన్నారు. నిందితులను నుంచి 13 ఫొటోలు,11 వీడియో క్లిప్పింగ్స్ ను స్వాధీనం చేసుకుని కోర్టులో డిపాజిట్ చేశారు. ‘‘వదిలేస్తే ప్రతినెలా రూ.50 లక్షలు ఇస్తానని నిందితులను జయరాం వేడుకునట్లు నిందితులు అంగీకరించారు” అని చెప్పారు. జయరాంపై విషప్రయోగం జరగలేదని  తెలిపారు.

 

Latest Updates