Q నెట్ కేసులో బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు

police-notices-to-bollywood-celebrities-in-q-net-multi-level-business-fraud

Q నెట్ స్కామ్ లో 38 కేసులు నమోదు చేసి.. 70 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. బెంగళూర్ లో రూ.2.7 కోట్ల నగదును కూడా సీజ్ చేశామని చెప్పారు. కేసులో Q నెట్ ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. షారుక్ ఖాన్, బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్ సహా మరికొంతమందికి నోటీసులు పంపించారు పోలీసులు.

“దేశ వ్యాప్తంగా Q నెట్ సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసి చాలామందిని మోసం చేసింది. మొత్తం రూ.5 వేల కోట్లు మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో బాధితులు ఉన్నారు. మినిస్టరీ కార్పొరేట్ అఫైర్స్ కు చాలా ఫిర్యాదులు అందాయి. ఈ కేసును దర్యాప్తు చేయాలని రిజిస్ట్రార్ ఆఫ్ కంపనీస్ కి ఆదేశాలు ఇచ్చింది. Q నెట్ లో కోట్ల డబ్బులు పెట్టుబడులు పెట్టి.. మోసం చేస్తున్నారంటూ రిజిస్ట్రార్ అఫ్ కంపెనీస్ నివేదిక ఇచ్చింది. ఎవరూ ఈ Q నెట్ లో పెట్టుబడులు పెట్టకండి అంటూ…. ఇది మోసపూరిత కంపెనీగా ROC రిపోర్టులో తెలిపింది. మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు చేస్తున్నారంటూ.. 12 మందిపై లుక్ ఔట్ నోటీసులు ఇచ్చింది. ఈ Q నెట్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు… దేశం దాటి పోకుండా నోటీసులు ఇచ్చారు. రూ.100 విలువ చేసే వస్తువును రూ.1500 కి అమ్ముతూ మోసం చేస్తున్నారు. కంపెనీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పెట్టుబడులతో వచ్చిన డబ్బుని వాడుకున్నారు. Q నెట్ కి ఎలాంటి రికార్డ్స్ లేవు. కేవలం డబ్బులు వసూలు చేసి మోసం చేయడమే వీరి పని. రూ.10, 856 ఖరీదు ఉన్న  వాచ్ ని 400% ఎక్కువకు అమ్ముతున్నారు” అని చెప్పారు సజ్జనార్.

మొదటగా జాయిన్ అయ్యేటప్పుడు ఎవరికీ కూడా Q నెట్ కంపెనీ గురించి చెప్పరు అనీ.. 30 రోజుల తరువాత మీరు క్యూ నెట్ సంస్థలో మెంబర్ అవుతారనీ.. మరికొంత మందిని చేర్పించాలని కోరుతారని చెప్పారు సజ్జనార్. 15 రోజుల కిందట… సైబరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న Q నెట్ భాదితుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. పెట్టుబడి పెట్టి మోసపోయిన మరో వ్యక్తి మహారాష్ట్ర లో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడనీ.. ఇలాంటి మల్టిలేవల్ మార్కెటింగ్ మోసాలు నమ్మకుండా ఉండాలని కోరుతున్నామని చెప్పారు సజ్జనార్.

Latest Updates