వరంగల్​లో చిట్ ఫండ్ కంపెనీలపై పోలీసుల కొరడా

వరంగల్​లో చిట్ ఫండ్ కంపెనీలపై పోలీసుల కొరడా
  •  చిట్ ఫండ్ కంపెనీలపై కొరడా
  •  ముగ్గురు ఓనర్ల అరెస్టు.. 
  •  మరో ఇద్దరు ఎస్కేప్
  • ప్రజల నుంచి వేలాదిగా ఫిర్యాదులు రావడంతో రంగంలోకి టాస్క్​ఫోర్స్ 

వరంగల్‍, వెలుగు: వరంగల్ లో మోసాలకు పాల్పడుతున్న చిట్ ఫండ్ కంపెనీలపై పోలీసులు కొరడా ఝులిపించారు. టాస్క్​ఫోర్స్​ పోలీసులు బుధవారం అచల, అక్షర, కనకదుర్గ చిట్‍ఫండ్స్ ఓనర్లను అరెస్ట్ చేసి కాజీపేట, మట్వాడా, హన్మకొండ పోలీస్‍ స్టేషన్లకు తరలించారు. మరో రెండు కంపెనీల ఓనర్లను కూడా అరెస్ట్​చేయాలని భావించినా, వారు పరారైనట్లు తెలిసింది. చిట్​ఫండ్​కంపెనీలపై ప్రజల నుంచి వేలాది ఫిర్యాదులు రావడంతో మొదట్లో వరంగల్​ సీపీ తరుణ్‍జోషి.. ఆయా కంపెనీల ఓనర్లను పిలిపించి కౌన్సెలింగ్​ ఇచ్చారు. అయిప్పటికీ తీరు మారకపోవడంతో యాక్షన్ తీసుకున్నారు. 

ప్రజాదర్బార్ లో ఫిర్యాదులు.. 
వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ ఆధ్వర్యంలో జనం సమస్యలు తెలుసుకోడానికి సీపీ తరుణ్‍జోషి రెగ్యులర్‍గా ‘‘ప్రజా దర్బార్‍’’ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చిట్‍ఫండ్‍ మోసాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో శుభనందిని, అచల, అక్షర, భవితశ్రీ, కనకదుర్గ చిట్స్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పోయినేడాది ఆగస్టు 6న కమిషనరేట్‍ పరిధిలోని చిట్‍ఫండ్‍ సంస్థల ఓనర్లతో సీపీ పోలీస్‍ హెడ్‍క్వార్టర్స్ లో మీటింగ్‍ పెట్టారు. రూల్స్ కు విరుద్ధంగా చిట్టి సొమ్మును రియల్, ఇతరత్రా​ దందాలు చేస్తూ  కస్టమర్లను తిప్పించుకోవడం బంద్‍ చేయాలని సూచించారు. చిట్‍ అమౌంట్​ఇవ్వకుండా ఫిక్స్​డ్​ డిపాజిట్లు లేదంటే వెంచర్లలోని ప్లాట్లను అంటగట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అయినా ఓనర్ల తీరు మారకపోవడంతో చివరికి యాక్షన్​కు దిగారు. కేసును టాస్క్​ఫోర్స్​ఇన్​చార్జి అడిషనల్‍ డీసీపీ వైభవ్‍ గైక్వాడ్‍కు అప్పజెప్పారు. కాగా, వరంగల్​ కేంద్రంగా నడిచే టాప్‍ 10 చిట్‍ కంపెనీల వెనక పలువురు ఎమ్మెల్యేలు, రూలింగ్​పార్టీ లీడర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ అరెస్టుల పర్వం ఇంతటితో ఆగుతుందో? కొనసాగుతుందో? చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.