మధ్యప్రదేశ్​లో హైడ్రామా… 17 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్

    సింధియా హస్తం ఉందన్న ఆరోపణలు

    ఢిల్లీలో సోనియాతో కమల్​నాథ్​ భేటీ

    టూర్​ కుదించుకుని భోపాల్​కు సీఎం

17 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్.. అర్ధరాత్రి మంత్రులంతా రాజీనామా

రోజుకో మలుపు తిరుగుతున్న మధ్యప్రదేశ్​ రాజకీయాల్లో తాజాగా పెద్ద కుదుపే చోటుచేసుకుంది. మొన్న పదిమంది ఎమ్మెల్యేలు మిస్సింగ్​ అంటూ రేగిన గందరగోళం కాస్త సద్దుమణిగిందని అనుకునేలోపే మరోటి ముంచుకొచ్చింది. ఈసారి 17 మంది ఎమ్మెల్యేలు గాయబ్​ అయ్యారు. ఫోన్లు స్విచ్ఛాప్​ చేసి, టచ్​లో లేకుండా పోయారు. ఇప్పుడు కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలంతా పార్టీ సీనియర్​ నేత జ్యోతిరాధిత్య సింధియాకు మద్దతిచ్చే వాళ్లే కావడంతో కమల్​నాథ్​ సర్కారుకు సంకటం వచ్చిపడింది. దీంతో అర్ధరాత్రి మంత్రులతో సీఎం కమల్​నాథ్​ అత్యవసరంగా సమావేశమయ్యారు. తర్వాత మంత్రులంతా రాజీనామా చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేందుకు కేబినెట్​ను తిరిగి ఏర్పాటు చేయాలని కమల్​నాథ్ ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరుకు ఎమ్మెల్యేలు!

సోమవారం ఉదయం నుంచి హైడ్రామా చోటుచేసుకుంది. మిస్సింగ్​ ఎమ్మెల్యేలు ఓ చార్టెడ్​ ఫ్లైట్​లో  మధ్యాహ్నం బెంగళూరులో ల్యాండయ్యారని, ఓ ఫైవ్​స్టార్  హోటల్ లో మకాం పెట్టారని సమాచారం. ఎమ్మెల్యేల మిస్సింగ్​ వార్త తెలిసీ ఢిల్లీలోనే ఉన్న జ్యోతిరాధిత్య సింధియా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్​షాలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్  ఢిల్లీలో పార్టీ చీఫ్ ​సోనియా గాంధీని కలుసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, సింధియా వైఖరిని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత కమల్​నాథ్ తన ఢిల్లీ టూర్​ను అర్థంతరంగా ముగించుకుని, హుటాహుటిన మధ్యప్రదేశ్​కు చేరుకున్నారు. రాష్ట్రంలో సర్కారును కూలగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం సింధియాతో కుట్రపన్నిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో రాష్ట్రంలో టెన్షన్​ నెలకొన్నా సింధియా ఢిల్లీలోనే ఉండడంతో.. ఎమ్మెల్యేల అదృశ్యం వెనక ఆయన హస్తం ఉందని కొంతమంది నేతలు అంటున్నారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది.

అవిశ్వాసం పెట్టే ఆలోచనలో బీజేపీ

అసెంబ్లీలో కమల్​నాథ్​ సర్కారుకు తగిన బలంలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నరు. సభ్యుల్లో చాలామంది సర్కారుపై అసంతృప్తితో ఉన్నారన్నారు. అసమ్మతి నేతలను తమవైపు తిప్పుకుని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రాజ్యసభ ఎన్నికలకు ప్రియాంక?

రాజ్యసభ ఎలక్షన్లలో పార్టీ నుంచి ఎవరిని నామినేట్​చేయాలనే విషయంపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్​ సోనియా గాంధీ వివిధ రాష్ట్రాల నేతలతో భేటీ అయ్యారు. సోనియాను కలిసిన వారిలో మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్, హర్యానా సీఎం భూపేందర్​ సింగ్​ హుడా, జమ్మూ కాశ్మీర్​ ఏఐసీసీ ఇంచార్జ్​ అంబికా సోనిలను వేర్వేరుగా కలిసి, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ప్రియాంక గాంధీని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని ఆ రాష్ట్ర నేతలు పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీలోని కాంగ్రెస్​ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ఉంది. కొందరు ఎమ్మెల్యేలు అలిగి పార్టీ, ప్రభుత్వ మీటింగ్​లకు డుమ్మా కొడుతున్నారు. దీంతో ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందోనన్న భయం పార్టీ వర్గాల్లో నెలకొంది.

 

Latest Updates