అటు TRS.. ఇటు కాంగ్రెస్.. ‘పరిషత్’ పరేషానీ

political parties focus on MPTC, ZPTC elections in Telangana

టీఆర్ఎస్ లో..

  • సొంత నేతలు, వలస నేతలతో గులాబీ ఉక్కిరిబిక్కిరి
  • పోటీ ఎక్కువ కావడంతో టికెట్ల పంపకాల్లో ఇక్కట్లు
  • జడ్పీ చైర్మన్ పదవిపై చాలా మంది నేతల గురి
  • చేరికలపుపడే హామీలు దక్కాయంటున్న ఇంకొందరు

కాంగ్రెస్ లో..

  • ఖర్చు భయంతో కాంగ్రెస్ నేతల వెనుకడుగు
  • గెలిచినా.. జడ్పీ చైర్మన్ దక్కదేమోనని అనుమానం
  • ఫిరాయింపులతో మరింత అనాసక్తి
  • పోటీలో ఉండాల్సిందేనంటున్న అధిష్ఠానం

నేడో రేపో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది.పార్టీల గుర్తులపై జరిగే ఈ ఎన్నికల్లో  వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని అటు టీఆర్ ఎస్ .. ఇటు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టాయి. అయితే.. టికెట్ల విషయంలో మాత్రం ఆ రెండు పార్టీల్లో విచిత్రమైన  పరిస్థితి నెలకొంది. ఉద్యమ కాలం నుంచిపనిచేస్తున్న సొంత నేతలు, ఇటీవల వరుస కట్టి పార్టీల్లోకి వచ్చి చేరిననేతలు ఎవరికి వారు టికెట్ కోసం పోటీపడుతుండటం టీఆర్ ఎస్ కుసమస్యగా మారింది. ఎంతోకాలంగా పదవులు లేకుండా ఉన్నామని,ఈ సారి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని గులాబీ పార్టీ సీనియర్లుపట్టు బడుతున్నారు. పదవులు దక్కుతాయన్న కచ్చితమైన హామీతోనేతాము పార్టీలోకి వచ్చి చేరామని, ఆ హామీని నిలబెట్టు కోవాలని వలసనేతలు కోరుతున్నారు. ఇక, ఇప్పటికే  వరుస ఎన్నికల్లో భారీగా ఖర్చుపెట్టామని, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో మళ్లీ ఖర్చు పెట్టే పరిస్థితి తమవద్ద  లేదని కాంగ్రెస్ నేతలు వెనుకడుగు వేస్తున్నారు. పైగా జడ్పీటీసీగాగెలిస్తే.. జడ్పీ చైర్మన్ పదవి దక్కుందన్న నమ్మకం లేదని,గెలిచినవాళ్లు పార్టీలో ఉంటారన్న భరోసా కూడా లేదని వారు పోటీకివిముఖత వ్యక్తం చేస్తున్నారు. నమ్మకంతో  గెలిపించిన ఎమ్మెల్యేలుఅధికార పార్టీ ఆకర్ష్ కు తలొగ్గి కారెక్కెరాని గుర్తు చేసుకుంటున్నారు.

హైదరాబాద్, వెలుగు: జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం టీఆర్ఎస్ లో భారీపోటీ నెలకొంది. సీనియర్లు, వలస నేతలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. కాంగ్రెస్ లో మాత్రం ఖర్చులు, ఫిరాయింపుల భయంతో సీనియర్లు పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ మంది టికెట్​ ఆశిస్తుండటంతో టికెట్లు ఎలా కేటాయించాలని గులాబీ నాయకత్వం తలపట్టుకుంటుంటే.. పోటీకి సీనియర్లు ముందుకు రాకపోవడంతో ఎవరిని బరిలో నిలపాలని కాంగ్రెస్ నాయకత్వం కలవరపడుతోంది.

సొంత నేతలు.. వలస నేతలు

అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన భారీ విజయంతో టీఆర్‌ఎస్‌ జోష్ మీదుంది. ప్రభుత్వం టీఆర్ఎస్ దే కనుక ఆ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే వాళ్ల సంఖ్య భారీగా ఉంది. దీనికితోడు ఎన్నికలకు ముందు, తర్వాత టీఆర్‌ఎస్ లోకి ఇతర పార్టీల నుంచి విపరీతమైన వలసలు జరిగాయి. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుం డా వచ్చినవాళ్లను వచ్చినట్లు గా చేర్చుకుంటూ పోయారు. లోక్ సభ ఎన్నికల్లోనూ చివరి నిమిషంలో వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా కొందరిని అప్పటికప్పుడు చేర్చు కున్నారు. చేరికల సందర్భంగా సదరు నేతలు పార్టీ నాయకత్వం నుంచి పలు రకాల హామీలు అందుకున్నారు. అందులో జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు కూడా ఉన్నాయి. దీంతో వలస నేతలతోపాటు పార్టీలోఎప్పటి నుంచో ఉంటున్న వాళ్లు సైతం ఈ పరిషత్ ఎన్నికల్లో టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. ఫలితంగా టికెట్ల కేటాయింపు అంశం టీఆర్‌ఎస్ కు సమస్యగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినవారు సైతం జడ్పీ చైర్మన్ కావాలని ఆశపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన మీటింగ్ లో ఇద్దరి పేర్లను జడ్పీ చైర్మన్ పదవులకు ప్రకటించారు కూడా. దాంతో ఇతర నేతలు సైతం ఆ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొందరు నేతలైతే తమ కుటుంబసభ్యులు, బంధువులకు టికెట్లు ఇప్పిం చుకోవాలని, అటు తర్వాత ఎలాగైనా జడ్పీచైర్మన్ పదవిని రాబట్టుకోవాలని శ్రమిస్తున్నారు. టికెట్ కోసం నేతలు ఇటు ప్రగతి భవన్‌ చుట్టూ, అటు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్ లు కొడుతున్నారు. పార్టీలోని ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఎంపీటీసీ టికెట్లకన్నా.. జడ్పీటీసీ టికెట్ల కోసం టీఆర్ఎస్ లో పోటీ భారీగా ఉంది.

ఆ భారాన్ని మోయలేం

నాలుగు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో.. మొన్నలోక్ సభ ఎన్నికల్లో.. ఇలా వరుస ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టామని, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో మళ్లీ ఖర్చు పెట్టే పరిస్థితి తమకు లేదని కాంగ్రెస్ లో చాలామంది సీనియర్ నేతలు వెనుకడుగు వేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడి గెలిచిన, ఓడిన నేతల్నిఆ పార్టీ అధిష్టానం మొన్న లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపిం ది. వీరిలో కొందరు ఇష్టంగా పోటీ చేస్తే , మరికొందరు అధిష్ఠానం ఆదేశాలు కాదనలేక బరిలోకి దిగారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ పోటీ పడాలని పార్టీ అధిష్టానం కొందరు సీనియర్‌ నేతలను పురమాయిం చింది. పోటీకి ఆసక్తి చూపుతున్న వారి జాబితా కోసం సమావేశాలు ఏర్పాటు చేయించింది. అయితే చాలా మంది పోటీ చేయబోమని తేల్చేశారు. ద్వితీయశ్రేణి నాయకత్వమే పోటీకి ఆసక్తి చూపుతోం ది. ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చుకుపోయిం దని, మళ్లీ పోటీచేయడం తమ వల్ల కాదని సీనియర్లు చెప్తున్నారు.

ప్రస్తుతమున్న ఫిరాయింపుల వాతావరణంలో జెడ్పీచైర్మన్‌ అవుతామనే ఆశలు కూడా లేవని వారు అంటున్నారు. హేమాహేమీలమనుకున్న నాయకులు, పార్టీని దశాబ్దాలుగా అంటి పెట్టుకొని ఉన్నవాళ్లు రాత్రికి రాత్రే కండువాలు మార్చేశారని, నమ్మకంతో గెలిపిం చుకున్న ఎమ్మెల్యేల్లో చాలా మంది అధికార పార్టీలోకి వెళ్లిపోయారని వారు గుర్తుచేసుకుంటున్నారు. కష్టపడి జడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించుకున్నా..వారు కూడా పార్టీ మారబోరనే నమ్మకం ఏముందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా తాము పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయలేమని పలువురు నేతలు పీసీసీ దృష్టికి తెస్తున్నారు. జడ్పీ చైర్మన్ పదవి దక్కితేనైనా తమకంటూ హోదా ఉంటుందని, ఫిరాయింపుల వాతావరణంలో ఆ పదవి దక్కే పరిస్థితి లేదని, అలాంటప్పుడు పోటీ చేయడం వృథా అని వెనుకడుగు వేస్తున్నారు. అయినా.. పీసీసీ మాత్రం తన ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. సీనియర్లను ఒప్పించి ఎలాగైనా పోటీలో దింపాలని, వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని కసరత్తు చేస్తోంది.

టీడీపీలో నిర్లిప్తత.. బీజేపీలో కొంత కదలిక

టీడీపీని నిర్లిప్తత, నిరాశ వెంటాడుతోంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో పార్టీకి ఉందనుకున్న కొంత క్యాడర్‌ కూడా చేజారిపోతోంది. పలువురు లీడర్లు కూడా ఈ మధ్య ఇతర పార్టీల్లో చేరిపోయారు. పరిషత్ ఎన్నికల్లో పోటీచేయడంపై ఆ పార్టీ నేతల్లో ఓ స్పష్టత రాలేదు. ఇక లోక్ సభ ఎన్నికల్లో తమ పరిస్థితి కొం త మెరుగుపడిందని భావిస్తున్న బీజేపీ.. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది.సాధారణంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను పెద్దగా పట్టించుకోని కమలదళం.. పార్టీలో ఇటీవల జరిగినచేరికల దృష్ట్యా రంగంలోకి దిగాలని భావిస్తోంది.

Latest Updates