ఖమ్మం రాజకీయాలకు డాక్టర్లు కావాలి

political-parties-interested-on-local-doctors-for-hiring-in-khammam

రాజకీయాల్లో ఒకప్పుడు యాక్టర్లకు  మంచి క్రేజ్  ఉండేది. ఇప్పుడు  ట్రెండ్ మారి  డాక్టర్లకు  క్రేజ్ పెరిగింది.  దీంతో  ఖమ్మం జిల్లాలో డాక్టర్లు  రాజకీయాల్లోకి  వచ్చేందుకు  ఆసక్తి చూపుతున్నారు. పొలిటికల్ పార్టీలు కూడా డాక్టర్లను  తమ పార్టీలో  చేర్చుకునేందుకు  విశ్వప్రయత్నాలు  చేస్తున్నాయి.

రాజకీయాల్లో రాణించాలంటే ప్రతిభతో పాటు పాపులారిటీ కూడా ఉండాలి. అప్పుడే వారు చెప్పే మాటలను జనం గౌరవిస్తారు. అందుకే ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీలు ఇప్పుడు పేరుపొందిన డాక్టర్లపై దృష్టి పెట్టాయి. డాక్టర్ల ఇమేజ్ పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. జిల్లాలో మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీలతో అన్ని పార్టీల్లోనూ డాక్టర్లు క్రియాశీలకంగా పని చేశారు. రాజకీయ మార్పుల వల్ల కొంతకాలంగా డాక్టర్లు రాజకీయాలకు దూరమయ్యారు. దీంతో పార్టీలు మళ్లీ డాక్టర్లపై ఫోకస్ పెట్టాయి. డాక్టర్లు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రచారానికి అయ్యే ఖర్చంతా సొంతగా పెట్టుకోగలరని అనుకుంటున్నాయి.

డాక్టర్ల ఆర్థిక నేపథ్యంతో పాటు సామాజిక అంశాలను పరిశీలిస్తున్నాయి పార్టీలు.  ప్రస్తుతం జిల్లాలో చిన్నపిల్లల వైద్యుడు కూరపాటి ప్రదీప్ కుమార్ మంచి క్రేజ్ లో ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రదీప్ కుమార్ ది రాజకీయ నేపథ్యమున్న కుటుంబమే. ప్రదీప్ కుమార్ తండ్రి టీడీపీలో సీనియర్ లీడర్. ఈయన బావ టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యం అందిస్తున్న ప్రదీప్ కుమార్ ను పార్టీ లో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి.

చిన్న పిల్లల వైద్యానికి స్పెషలిస్టుగా పేరున్న మరో డాక్టర్ కేవి కృష్ణారావు. ఈయనకు మిలిటెంట్ పోరాటం చేసిన వ్యక్తి గా పేరుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు  హాస్పిటల్ మూసివేయించారు. ఉద్యమంలో జైలుకు వెళ్లారు. అందరి డాక్టర్లపై ఒత్తిడి పెంచి ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కృష్ణారావుకు టీఆర్ఎస్ ఇంతవరకు ఏ ఒక్క పదవీ ఇవ్వలేదు. దీంతో కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కృష్ణారావును పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి.

జిల్లాలో పేరున్న మరో డాక్టర్ గంగరాజు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మధిర, సత్తుపల్లి టికెట్లను ఆశించారు. గంగరాజు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. పరిషత్ ఎన్నికల్లో కల్లూరు జడ్పీ టికెట్ గంగరాజుకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఐతే శ్రీనివాస్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో గంగరాజుకు  టికెట్ రాలేదని తెలుస్తోంది.

డాక్టర్ అన్వర్…. ఇప్పుడు జిల్లాలో ఉన్న డాక్టర్లలో DNB చదివిన ఏకైక వ్యక్తి. ఇతనికి మైనార్టీ  వర్గాల్లో మంచి క్రేజ్ వుంది. తండ్రి  రిటైర్డ్ ఉద్యోగి కావడం…. ఇతినికి కలిసి వచ్చే అంశం ఇతన్ని పార్టీలో చేర్చుకుంటే బాగుంటుదనే అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ వుంది. ప్రొగ్రెసివ్ భావాలు కలిగిన వ్యక్తిగా అన్వర్ కు పేరుంది. మైనార్టీ వర్గాలను ఆకర్షించేందుకు అన్వర్ ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి.

డాక్టర్ అనిమల్ల కొండల్ రావు. నల్గొండ జిల్లాకు చెందిన ఈయన మధిరలో స్థిరపడ్డారు. కొండల్ రావుకు ఉద్యమ నేపథ్యం ఉంది. ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ DMHOగా మంచి గుర్తింపు సంపాదించారు. గతంలో వైసీపీలో చేరాలని జగన్ కోరినప్పటికీ… కొన్ని  కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.  టీఆర్ఎస్ నుంచి మధిర టికెట్ కొండల్ రావుకు వస్తుందనే ప్రచారం జరిగింది. ఐతే రాజకీయ సమీకరణాల్లో భాగంగా కొండల్ రావుకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం కొండల్ రావు నల్గొండ ఇంఛార్జ్ DMHOగా పని చేస్తున్నారు.

జిల్లాలో పేరున్న మరో మైనార్టీ వర్గానికి చెందిన డాక్టర్ ఆరిఫ్. ఇతని కుటుంబ సభ్యులంతా ఉన్నత విద్యావంతులు కావడంతో ఆరిఫ్ కు మంచి గుర్తింపు ఉంది. అన్ని వర్గాల ప్రజలతో అరిఫ్ కు ఉన్న పరిచయాలు ఉండటం వల్ల కాంగ్రెస్, టిఆర్ఎస్  ఆరీఫ్ ను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

డాక్టర్ గోపినాధ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. సామాజిక అంశాలపై పట్టున్న వ్యక్తిగా గోపినాథ్ కు గుర్తింపు ఉంది. గోపీనాథ్ అనేక పుస్తకాలు రాశారు. కులవ్యవస్థను గోపీనాథ్ తీవ్రంగా తప్పుపడుతుంటారు. పేదలకు సహకారం అందిస్తున్న వ్యక్తి కావడోంత గోపీనాథ్ ను చేర్చుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

జిల్లాలో  పేరున్న మరో డాక్టర్ మురళి . ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈయన  ఖమ్మం జిల్లాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మురళీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు.అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లును బరిలోకి దించారు. మురళీ ప్రస్తుతం బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు…

డాక్టర్ పాపారావు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ల గొంతుకగా నిలిచారు. ప్రస్తతం తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం  అందిస్తున్నారు.

డాక్టర్ మట్టా దయానంద్ 2014లో వైసీపీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ టికెట్ వస్తుందని భావించారు. ఐతే పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యరు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిచి మాట్లాడడంతో పోటీపై వెనక్కి తగ్గారు……

డాక్టర్ శంకర్ నాయక్ 2014లో టీఆర్ఎస్ తరపున పినపాక నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి నామినేష్ వేసిన శంకర్ నాయక్ చివర్లో విత్ డ్రా  చేసుకున్నారు.  కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.

డాక్టర్ సోయం బాపురావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి సిపిఎం తరపున పోటి చేసి ఓడి పోయారు. డాక్టర్ కోటా రాంబాబు బిఎల్ఎఫ్  తరపున మధిర నుంచి పోటి చేసి ఓడిపోయారు. డాక్టర్ చంద్రావతి సిపిఐ నుంచి 2009 లో పోటి చేసి గెలుపొందారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరిన చంద్రావతి ప్రస్తుతం టీఎస్ పీఎస్సీ డైరెక్టర్ గా ఉన్నారు.

Latest Updates