పంచాయతీ ఎన్నికలు: ఈనెల 28న పోలింగ్

జనవరిలో పలు కారణాలతో నిలిచిపోయిన పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రేపు(గురువారం) నోటిఫికేషన్ జారీ చేసి ఈనెల 28న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

తెలంగాణలో ఎన్నికలు జరగని పంచాయతీల్లో పోలింగ్ కు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. జనవరిలో 12 వేల 731 పంచాయతీలకు 3 విడతల్లో పోలింగ్ జరిగింది. అయితే కొన్ని పంచాయతీల్లో సర్పంచ్, వార్డ్ మెంబర్ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడం, వచ్చిన నామినేషన్లు సరిగా లేకపోవడం, రిజర్వేషన్లు సరిగా  కేటాయించకపోవడంతో 13 గ్రామాల్లో సర్పంచ్, 253 వార్డ్ మెంబర్ల పదవులకు ఎన్నికలు నిర్వహించలేదు. వీటికి రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేసి, ఈనెల 28న పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి షెడ్యూల్ ప్రకటించారు.

రేపటి(గురువారం) నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. 16 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 17న నామినేషన్ల పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 20న నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశమిచ్చారు. పోలింగ్ 28న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు రిలీజ్ చేస్తారు. ఉపసర్పంచ్ ఎన్నిక అదే రోజు సాయంత్రం జరగనుంది.

యాదాద్రి జిల్లాలోని కొయ్యలగూడెం, సిరిసిల్ల జిల్లాలోని గొల్లపల్లి, నిజామాబాద్ జిల్లాలోని గంగారాం తండా, తిర్మాన్ పల్లి, మంచిర్యాల జిల్లాలో నెల్కి వెంకటాపూర్, వందూరుగూడ, జనగామ జిల్లాలోని శివునిపల్లెలో ఎన్నికలు జరగనున్నాయి. అటు మహబూబ్ నగర్ జిల్లాలో కంకుర్తి, గుర్జాల్, ఆసిఫాబాద్ జిల్లాలోని వెంకటాపూర్, జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, భద్రాద్రి జిల్లాలోని సంగం, నారాయణపేట పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.

Latest Updates