ముంబై, ఢిల్లీలో పొల్యూషన్‌ తగ్గింది

  • ఒకప్పటి పొల్యూషన్‌ జోన్లు.. ఇప్పుడు గ్రీన్‌ జోన్లు

న్యూఢిల్లీ: ఎప్పుడూ జనాల ఉరుకుల పరుగులు, వాహనాల రద్దీతో కనిపించే దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రకృతి మాత్రం పులకించిపోతోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలు తిరగకపోవడంతో ముంబై, ఢిల్లీలో పొల్యూషన్‌ తగ్గిపోయిందని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న పొల్యూషన్‌ హాట్‌స్పాట్లు ఇప్పుడు గ్రీన్‌ జోన్లుగా మారిపోయాయని అన్నారు. ఢిల్లీలోని ఎనిమిది హాట్‌స్పాట్‌లలో ఇప్పుడు పొల్యూషన్‌ లేదని సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌‌ క్వాలిటీ వెదర్‌‌ ఫోర్‌‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (సఫర్‌‌) డైరెక్టర్‌‌ గుఫ్రాన్‌ బేగ్‌ చెప్పారు. వినోభాపురి, ఆదర్శ్‌ నగర్‌‌, వసుంధర, సాహీబాద్‌, ఆశ్రమ్‌ రోడ్‌, పంజాబ్‌ భాగ్‌, ఓక్లా అండ్‌ బడార్‌‌పూర్‌‌లో పొల్యూషన్‌ తగ్గిందన్నారు. ముంబైలోని వొర్లీ, బోరీవలీ, భందూప్‌ ప్రాంతాల్లో ముంబై మెట్రో పాలిటన్‌ రీజన్‌లో కంటే తక్కువ పొల్యూషన్‌ నమోదైందన్నారు. పుణే, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాల్లో కూడా పొల్యూషన్‌ తగ్గిపోయిందని సెంట్రల్‌ పొల్యూషనల్‌ బోర్డు చెప్పింది. కరోనా చైన్‌ను బ్రేక్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో బస్సులు, రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వెహికిల్స్‌, ఇండస్ట్రీస్‌ మూత పడటంతో పొల్యూషన్‌ బాగా తగ్గింది.

Latest Updates