వరి దిగుబడి తగ్గి.. పత్తి పెరుగుతదంట..

దేశవ్యాప్తంగా అన్ని నదులు ఫుల్లుగా ప్రవహిస్తున్నాయి. పెద్ద పెద్ద డ్యామ్​లు నిండి గేట్ల నుంచి నీళ్లు కిందకు దూకుతున్నాయి. దీంతో రైతులు మస్తు ఖుషీ అవుతున్నారు. నీళ్లు బాగానే ఉన్నా ఈ సారి మాత్రం వరి దిగుబడి తగ్గిపోతుందట. పత్తి మాత్రం మునుపటితో పోలిస్తే మరింత ఎక్కువవుతుందట. ప్రైవేట్​ వాతావరణ సంస్థ స్కైమెట్​ స్టడీలో తేలిన విషయమిది. ఖరీఫ్​ సీజన్​లో పత్తి దిగుబడి 14 శాతం పెరుగుతుందని స్కైమెట్​ తెలిపింది. ఈ ఏడాదికిగానూ 3 కోట్ల 42 లక్షలకుపైనే పత్తి బేళ్లు ఉత్పత్తవుతాయని చెప్పింది. గత ఏడాది అది 3 కోట్ల 8 లక్షలు మాత్రమేనని చెప్పింది. అయితే, వరి ఎక్కువగా పండే రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా ఉన్నందున వరి దిగుబడి తగ్గుతుందని సంస్థ తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా వరి ఉత్పత్తి 13 శాతం తగ్గుతుందని చెప్పింది.

పోయిన సంవత్సరం 10 కోట్ల 20 లక్షల టన్నులుగా ఉన్న వరి దిగుబడి ఈ ఏడాది 8 కోట్ల 87 లక్షలకు పడిపోతుందని చెప్పింది. ఇటు సోయా ఉత్పత్తి కూడా 12.5 శాతం మేర తగ్గి, 1.199 కోట్ల టన్నుల ఉత్పత్తి జరుగుతుందని చెప్పింది. అయితే, మధ్యప్రదేశ్​, మహారాష్ట్రల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడడం సోయా దిగుబడిపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి 0.5 శాతం తగ్గుతుందని చెప్పింది. దిగుబడి 85.3 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా వేసింది. ‘‘వర్షాలు లేట్​గా రావడంతో చాలా రాష్ట్రాల్లో వరి, సోయా బీన్​, పప్పు పంటలను ఆలస్యంగా వేశారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో అయితే ఇంకా జరుగుతూనే ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావం వల్ల ఆ పంటలు వేయనేలేదు. దాని ప్రభావం పంట దిగుబడిపై పడుతుంది. ప్రత్యేకించి సోయా, పప్పు ధాన్యాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటిని మామూలుగా జులై మధ్యలోనే విత్తుతుంటారు. కాబట్టి ఖరీఫ్​ సీజన్​లో చాలా ప్రాంతాల్లో అది మిస్సయింది” అని స్కైమెట్​ తెలిపింది. కాగా, ఆగస్టు 23న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్​లో పంటల సాగు2 శాతం తగ్గింది. గత ఏడాది 9.97 కోట్ల హెక్టార్లలో పంటల్ని సాగు చేయగా, ఈ ఏడాది అది 9.75 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. బీహార్​, జార్ఖండ్​, పశ్చిమబెంగాల్​లో లోటు వర్షపాతం వల్ల వరి సాగు 6 శాతం తగ్గింది.

 

 

Latest Updates