‘జూపల్లి నిర్ణయం తీసుకో.. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకో ‘

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. జూపల్లి తన రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించుకునే సమయమిది.

కొల్లాపూర్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో  జూపల్లి వర్గానికి చెందిన 11 మంది టీఆర్ఎస్ రెబల్స్ గా పోటీ చేసి గెలిచారు.  మున్సిపాలిటీ చైర్మన్ పదవులపై మాట్లాడేందుకు జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ వచ్చారు. ఐతే… ఆయనకు కేటీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.

టీఆర్ఎస్ అధిష్టానం జూపల్లి కి  అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంపై పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న జూపల్లి కృష్ణారావు కు టిఆర్ఎస్ ఆఫీస్ లో, ఆ నాయకులతో జరుగుతున్న అవమానం తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అవమానమని అన్నారు.”తెలంగాణ కోసం జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ లో ఉండి మాతో కలిసి ఉద్యమించారు. మంత్రి పదవిని కాదని రాజీనామా చేసి టిఆర్ఎస్ లో కలిశారు. అలాంటి నాయకుడు తన నియోజక వర్గంలో తాను ఏంటో నిరూపించుకొని గెలిచి వచ్చినా టిఆర్ఎస్ నాయకులు అవమానించడం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ప్రజలను అవమానించడమే అవుతుంది. ఇప్పటికైనా తను టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి జూపల్లి తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి” అని పొన్నం అన్నారు.