రోడ్లు మోరీలైతున్నయ్..హైదరాబాద్ లో అధ్వాన్నంగా డ్రైనేజీ వ్యవస్థ

  •     కీలక ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి పైపులైన్లే..
  •     ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ప్రచార అంశంగానే సీవరేజీ మాస్టర్ ప్లాన్
  •     ఏడాది కిందటే ప్లాన్  ఫైనల్​ అయినా ఓకే చేయని సర్కారు
  •     సమీక్షలతో హడావుడే తప్ప.. చర్యలు శూన్యం
  •     తరచూ పైప్​లైన్లు పగిలి రోడ్లపై పారుతున్న మురుగు
  •     మంచి నీళ్లలో కలుస్తున్న గటేరు నీళ్లు

హైదరాబాద్, వెలుగుపైన మెరుగు, లోపల మురుగు అన్నట్టుగా ఉంది గ్రేటర్​ హైదరాబాద్​లో డ్రైనేజీ వ్యవస్థ. పెరిగిన జనాభాకు తగినట్టుగా లేని డ్రైనేజీలు, వందల ఏండ్ల కింద నిజాం కాలంలో నిర్మించిన పైపులైన్లు, తరచూ పగిలిపోతూ, పూడుకుపోతూ రోడ్లపైనే పారుతున్న మురుగు నీరు, మూతల్లేని మ్యాన్​హోళ్లు.. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కోర్​ సిటీ, పాతబస్తీ ప్రాంతాల్లోనైతే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎప్పుడైనా చిన్న వాన పడితే.. డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగు నీళ్లు ఇండ్లలోకి వెళ్తున్న దుస్థితి. మంచినీటి పైపులైన్లలోకి మురుగు నీళ్లు చేరుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థను సెట్​ చేసేందుకు అద్భుతమైన సీవరేజీ మాస్టర్​ ప్లాన్​ అమలు చేస్తామని ఎలక్షన్ల ముందు చెప్పడం, తర్వాత పట్టించుకోకపోవడం రివాజుగా మారింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్​ సర్కారు కూడా ఆ దిశగా ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ చర్యల్లేవు. దాంతో హైదరాబాద్​ను మురుగు వదలడం లేదు.

నిజాం కాలం నాటివే..

1908లో హైదరాబాద్ నగరం వరదల్లో చిక్కుకుంది. చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఎక్కడిక్కడ నీళ్లు నిలిచిపోయాయి. నిజాం మీర్‌‌‌‌‌‌‌‌ ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ అలీఖాన్‌‌‌‌‌‌‌‌ దీనికి పరిష్కారంగా ప్రభుత్వ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ అలీ నవాజ్‌‌‌‌‌‌‌‌ జంగ్‌‌‌‌‌‌‌‌ బహదూర్‌‌‌‌‌‌‌‌, ప్రఖ్యాత ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలకు సిటీలో సీవరేజీ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగానే ఈసీ, మూసీ నదులపై జంట జలాశయాల నిర్మాణం, వరద నీళ్లు పోయేందుకు నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు ఐదు రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్‌‌‌‌‌‌‌‌ పైపులైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్​తో నిర్మాణాలు చేశారు. అయితే అప్పటికీ ఇప్పటికీ సిటీ జనాభా 20 రెట్లు పెరిగింది. అయినా పాత కాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, కెపాసిటీ సరిపోకపోవడంతో మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నాయి. దీనికి తాము పరిష్కారం చూపుతామంటూ గత జీహెచ్ఎంసీ ఎలక్షన్ల సమయంలో.. సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను ప్రకటించారు. కానీ దానిని ఏ మాత్రం అమల్లోకి తీసుకురాలేదు.

కోట్ల ఖర్చుతో సీవరేజీ మాస్టర్ ప్లాన్ వేసినా..

ప్రస్తుతం కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్​లో.. వచ్చే 30 ఏళ్లలో పెరిగే జనాభాకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్​ రూపొందించారు. ఈ ప్లాన్​ రెడీ చేయడానికే వాటర్ బోర్డు దాదాపు రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్ఎస్​ సర్కారు సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను ప్రచారాస్త్రంగా మార్చుకుంది. పలు సంస్థలు, ఏజెన్సీల సాయంతో మరో మాస్టర్ ప్లాన్ వాటర్ బోర్డుకు చేరినా ఇంకా మార్పులు, చేర్పులు, సలహాలు, సూచనలతోనే గడిచిపోతోంది. పదేళ్ల కిందటి సీవరేజీ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనకైనా రూపం కల్పించలేకపోయారు.

మాస్టర్ ప్లాన్ రూపురేఖలు ఇలా..

పదేళ్లనాటి ప్రతిపాదనలకు తుదిరూపు తీసుకొచ్చేలా మాస్టర్ ప్లాన్ రెడీ అయితే.. కోర్ సిటీలోని 6 జోన్లు, ఓఆర్ఆర్ లోని గ్రామాలు, మున్సిపాలిటీలతో కలిపి 2,245 చదరపు కిలోమీటర్ల మేర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతమున్న జనాభా డబుల్​ అయినా సీవరేజీ నిర్వహణ సులభమయ్యేలా ప్రణాళిక రూపొందించారు. పాత పైప్​లైన్లను రీస్టోర్​ చెయ్యడం, కొత్తవి వేయడం, దీంతోపాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 3 వేల ఎంఎల్డీ మురుగునీటిని శుద్ధి చేసే కెపాసిటీతో 58 ఎస్టీపీలను నిర్మించడం వంటివి చేపట్టాలని నిర్ణయించారు. అయితే దానిని అమలు చేసేందుకు రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలు ఉండటంతో.. మాస్టర్ ప్లాన్ కు మోక్షం దొరకడం లేదని అంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో మొదలెట్టినా

నిజాం కాలం నాటి పైపులైన్లను రీస్టోర్ చేసేలా.. ఏయే ప్రాంతాల్లో పనులు చేపట్టాలనేది జీహెచ్ఎంసీ గతంలోనే గుర్తించింది. దశలవారీగా సీవరేజీ వ్యవస్థను మెరుగుపరిచేలా 2008లో అధికారులు పనులు మొదలుపెట్టారు. అందులో భాగంగా దాదాపు రూ.400 కోట్ల అంచనాలతో సీవరేజీ పనులు చేపట్టారు. కానీ మధ్యలోనే వదిలేశారు. నిర్మాణ వ్యయం రెట్టింపు కావడంతో చేతులెత్తేశారు. దీంతో సీవరేజీ నిర్వహణ దారుణంగా మారింది. ఏ గల్లీలో చూసినా డ్రైనేజీ నీళ్లు పారుతూనే ఉన్నాయి. మ్యాన్ హోళ్లను క్లీన్​ చేసేందుకు జెట్టింగ్ యంత్రాలను వినియోగిస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు.

ఎస్టీపీలకు జాగాలే గుర్తించలే..

రానున్న రోజుల్లో హైదరాబాద్​ సిటీలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని ఎక్కడిక్కడ క్లీన్​ చేసేందుకు.. సిటీని జోన్లుగా విభజించి ఎస్టీపీలను నిర్మించాలని మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు. దీనికోసం మూసీ పరీవాహకం, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తోపాటు గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాల్లో దాదాపు 70 ఎకరాల స్థలం అవసరమని గుర్తించారు. దీనికి సర్కారీ, ఖాళీ జాగాలను గుర్తించాలని రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు. ఈ క్రమంలోనే వర్టికల్ ఎస్టీపీలను నిర్మించాలన్న ప్రతిపాదనలూ తెరమీదికి వచ్చాయి. కానీ ఈ ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమైపోయాయి.

తాగునీటి పైపుల్లోకి గటేరు నీళ్లు

వందేళ్ల నాటి డ్రైనేజీ పైపుల పక్కనే కాలక్రమంలో తాగునీటి పైపులను వేశారు. డ్రైనేజీలు దెబ్బతిని లీకవడం, అ నీళ్లు తాగునీటి పైపుల్లోకి చేరడం జరుగుతోంది. దీంతో భోలక్ పూర్ వంటి ఘటనలు జరిగాయి కూడా. ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సీవరేజీ నీళ్లు తాగునీటిలో కలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల కలుషిత నీరు సరఫరా అవుతున్నా.. అధికారులు తాత్కాలిక రిపేర్లతో చేతులు దులిపేసుకుంటున్నారు.

Latest Updates