పోతారం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చెయ్యకుండా వివక్ష చూపుతున్నారు

జగిత్యాల జిల్లా: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్లంప‌ల్లి అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణ నిర్లక్ష్యానికి పోతారం ప్రాజెక్టు ఉదాహరణ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ప్రాజెక్ట్ ను సంద‌ర్శించిన ఆయ‌న‌.. అనంత‌రం జ‌గిత్యాల‌లో ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయ‌ని.. మిగిలిన 10% పనులు కూడా పూర్తి చెయ్యలేని అసమర్ధ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మ‌ని అన్నారు.

రైతులు కష్టపడి స్వంత ఖర్చులతో మత్తడి ఎత్తు పెంచుకుంటే…అది తమ కృషి అని ఎమ్మెల్యే రవి శంకర్ ,టీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చెయ్యక పోవడంతో వారు పనులు వదిలేసి పారిపోతున్నారని విమర్శించారు. పోతారం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చెయ్యకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నద‌ని, తక్షణమే మత్తడి ఎత్తు పెంచి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.

రైతులు ఆందోళన నిర్వహిస్తే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు కలెక్టర్ సమక్షంలో ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చార‌ని తెలిపారు. కానీ ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేద‌ని, ప్రాజెక్టు పూర్తి కాలేదని అన్నారు. కేవలం రూ.10 కోట్ల నిధులతో పనులు పూర్తవుతాయని.. ప్ర‌భుత్వం ఇవి కూడా విడుదల చెయ్యకుండా వివక్ష చూపిస్తున్నదని విమర్శించారు.

Latest Updates