పౌల్ట్రీ రైతును నిండా ముంచిన వర్షం: వేల కోళ్లు చనిపోయాయి

రంగారెడ్డి జిల్లా : రాత్రి కురిసిన భారీవర్షం ఓ పౌల్ట్రీ రైతును నిండా ముంచింది. వర్షానికి 9వేల 500 కోళ్లు చనిపోవడంతో 6 లక్షల రూపాయలు నష్టపోయాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి శివారులోని యాదిరెడ్డి ఫామ్ లోకి రాత్రి భారీగా వర్షపు నీరు వచ్చింది. తక్కువ సమయంలోనే వరదనీరు ఫాంను చుట్టేసింది. దీంతో 9వేల 500 ఫారం కోళ్లు చనిపోయాయి.

కరోనా మొదలైన కొత్తలో ఆ ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడింది. చికెన్ తో కరోనా వస్తుందన్న ప్రచారంతో ఆ సమయంలో అనేక మంది తినడం మానేశారు. దీంతో అమ్మకాలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగం తీవ్రంగా దెబ్బతింది. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్లీ పౌల్ట్రీ పుంజుకుంది. చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయం ప్రజల్లోకి వెళ్లడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. దీంతో వ్యాపారుల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు మళ్లీ తీవ్రంగా నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates