పొలిటీషియన్ల వల్లే ‘పోక్సో’కు దెబ్బ: ఎంపీ కొత్త ప్రభాకర్‌‌రెడ్డి

ఢిల్లీ, వెలుగు: ‘చిన్నారులపై అత్యాచారం చేసే నిందితులకు రాజకీయ నేతల అండ ఉండటం వల్ల దేశవ్యాప్తంగా 4 శాతం కేసులే నమోదవుతున్నాయి. వీళ్ల అండ లేకపోతే పోక్సో చట్టాన్ని సమర్థంగా అమలు చేయగలం’ అని ఎంపీ కొత్త ప్రభాకర్‌‌రెడ్డి అన్నారు. అత్యాచారం చేసే వాళ్లకు పడే శిక్షలు గత పదేళ్లలో 32 నుంచి 28 శాతానికి తగ్గాయని, పైగా 2006లో 81 శాతం ఉన్న నేరాలు 2016కు 89 శాతానికి పెరిగాయని చెప్పారు. బాలల లైంగిక దాడుల పరిరక్షణ చట్ట సవరణ బిల్లు 2019పై ప్రభాకర్‌‌రెడ్డి గురువారం సభలో మాట్లాడారు.

ఆర్థిక, సామాజిక సమస్యల వల్ల బాధిత పేద తల్లిదండ్రులు కేసులు పెట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. సాక్ష్యాల సేకరణ,  ఫోరెన్సిక్ నమూనాలు సేకరించడంలో పోలీసుల వైఫల్యం కొంత వరకు బాధితులకు న్యాయం చేయలేకపోతున్నాయని చెప్పారు. లైంగిక నేరాలపై ధైర్యంగా మాట్లాడేందుకు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సభకు తెలిపారు. లైంగిక నేరాల కేసుల విచారణలో పిల్లలకు ఎదురయ్యే ప్రశ్నలు ఇబ్బందికరంగా ఉంటాయని.. న్యాయవాదులు ప్రత్యక్షంగా ప్రశ్నించడాన్ని చిన్నవారు తట్టుకోలేరన్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందన్నారు.

Latest Updates