బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కనిపించట్లేదని పోస్టర్లు

  • ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారని పార్టీ ప్రతినిధి వివరణ

భోపాల్: కరోనా వైరస్ బారిన పడి భోపాల్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తమ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఎక్కడా కనింపించట్లేదంటూ పోస్టర్లు వెలిశాయి. ‘‘ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తప్పిపోయారు. ఆమె కోసం వెతకండి”అంటూ మధ్యప్రదేశ్​లోని భోపాల్ నగరంలో శుక్రవారం పోస్టర్లు వెలిశాయి. రాష్ట్ర రాజధానిలో 1,400 మందికి కరోనా సోకి అల్లాడుతుంటే ఎంపీ మాత్రం కనపించడం లేదని స్థానికులు పోస్టర్లు వేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమలేశ్వర్ పటేల్ స్పందించారు. పదవిలో లేకున్నా కాంగ్రెస్ నేతలు ప్రజలకోసం పనిచేస్తున్నారని, కానీ ఎంపీగా గెలిచిన ఠాకూర్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదని ఆరోపించారు. కష్ట సమయాల్లో ప్రజలతో నిలబడలేని అటువంటి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవద్దని, ప్రజలు ఓటు వేసేముందు ఆలోచించాలని సూచించారు.
దీనీపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠారి ఎంపీ అందుబాటులో లేకపోవడాన్ని సమర్థించుకున్నారు. ప్రగ్యా ఠాకూర్ ప్రస్తుతం క్యాన్సర్ కు, కంటికి ట్రీట్​మెంట్ తీసుకుంటూ ఎయిమ్స్ లో ఉన్నారని చెప్పారు. ఆమె ఆధ్వర్యంలోని కమ్యూనిటీ కిచెన్ ద్వారా కిరాణా, ఆహారం పంపిణీ వంటి అనేక పనులు జరుగుతున్నాయని చెప్పారు.

 

Latest Updates