ప్రతిరోజూ పండగే ఎలా ఉంది..?

టైటిల్‌: ప్రతిరోజూ పండగే
జానర్‌: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు: సాయి ధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌, విజయ్‌కుమార్‌, నరేశ్‌, ప్రభ తదితరులు
సంగీతం: థమన్‌ ఎస్‌
సినిమాటోగ్రఫీ: జయకుమార్‌
నిర్మాత: బన్నీ వాస్‌
దర్శకత్వం: మారుతి
బ్యానర్లు: యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌

స్టోరీ

రఘురామయ్య (సత్యరాజ్) పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడతారు. ఒంటరిగా ఊళ్లో  జీవిస్తున్న ఆయనకి క్యాన్సర్‌‌‌‌ సోకుతుంది. నాలుగు వారాల్లో చనిపోతానని తెలియడంతో పిల్లల్ని చూడాలని ఆశపడతాడు. కానీ ఎవ్వరూ రావడానికి ఇష్టపడరు. పెద్ద కొడుకు రమేష్ (రావు రమేష్‌‌) కొడుకు సాయి (సాయి తేజ్) మాత్రం వెంటనే వచ్చేస్తాడు. చనిపోయేవరకు తాతయ్యను సంతోషంగా ఉండాలని తపన పడతాడు. ఫ్యామిలీ మెంబర్స్‌‌ అందరినీ బలవంతంగా రప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్లందరూ రఘురామయ్యకి సంతోషాన్ని అందించారా, ఆయన కోరుకున్నట్టుగా వీడ్కోలు చెప్పారా అనేది మిగతా కథ.

విశ్లేషణ

పోటీ ప్రపంచంలో సక్సెస్‌‌ఫుల్‌‌గా నిలబడటానికి చేసే ప్రయత్నంలో విలువైనవెన్నో కోల్పోతామని కొందరు గ్రహించరు. ఆశ పడిన టార్గెట్స్‌‌ కోసం అయినవాళ్లను నిర్లక్ష్యం చేస్తారు. అది ఎంత తప్పో చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. పాయింట్ చిన్నదే. కానీ చెప్పాలనుకున్న విషయం చాలా పెద్దది. అందుకే మెయిన్ పాయింట్‌‌ చుట్టూ కథను అందంగా అల్లుకున్నాడు మారుతి. తనదైన శైలిలో కామెడీని పండిస్తూ.. అక్కడక్కడా మనసుల్ని తాకుతూ.. చెప్పాలనుకున్నది క్లియర్​గా చెబుతూ… ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అయితే కామెడీ పండినట్టుగా ఎమోషన్స్‌‌ పండకపోవడం చిన్న మైనస్. ఎవ్వరూ రావడానికి ఇష్టపడని సమయంలో సడెన్‌‌గా మనవడు తనకోసం వస్తే ఆ తాత ఎంత మురిసిపోవాలి? ఎంత ఎమోషనల్ అయిపోవాలి? కానీ ఆ సీన్‌‌లో అంత డెప్త్‌‌ కనిపించదు. పైగా తండ్రి చావును సీరియస్‌‌గా తీసుకోని పిల్లలు కేవలం ఆస్తి కోసం ఆయన్ను ఇంప్రెస్ చేయడానికి చేసే పనులు కాస్త ఆర్టిఫీషియల్‌‌గా అనిపిస్తాయి. వాటిని కాస్త బ్యాలెన్స్‌‌డ్‌‌గా చూపించి, ఎమోషన్‌‌ డోసు ఇంకాస్త పెంచి ఉంటే సినిమా మరింత సూపర్బ్‌‌గా ఉండేది.

ఎవరెలా?

సాయి తేజ్‌‌ నటనలో ఎంత ఇంప్రూవ్ అయ్యాడో గత చిత్రంలోనే చూశాం. ఇందులో కూడా తన నటనతో మెప్పించాడు. అయితే కొన్నిచోట్ల అతని పాత్రకి మరికాస్త వెయిటేజ్‌‌ ఇవ్వాల్సిందేమో అనిపించ మానదు. సత్యరాజ్‌‌ ఎంత గొప్ప నటుడో చెప్పాల్సిన పని లేదు. చావుకు దగ్గరపడుతున్న తండ్రి పాత్రకి హుందాతనాన్ని తీసుకొచ్చారు. ఇక సినిమాకి మెయిన్ ఎసెట్ రావు రమేష్. తన అద్భుతమైన పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌తో రాక్ చేశారాయన. టిక్‌‌ టాక్ పిచ్చి ఉన్న అమ్మాయిగా రాశీఖన్నా భలే నవ్వించింది. కానీ ఆమె కామెడీని చివరి వరకూ కంటిన్యూ చేస్తే బాగుండేది. మిగతా వాళ్లంతా  పరిధి మేర ఆకట్టుకున్నారు.

ప్రొడక్షన్ వేల్యూస్‌‌కి వంక పెట్టడానికి లేదు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కథకి తగ్గట్టు చక్కగా సాగింది. సంపత్‌‌ సినిమాటోగ్రఫీకి ఫుల్ మార్కులు పడతాయి. మంచి సెంటిమెంట్ మూవీ కనుక డైలాగ్స్‌‌లో ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది. కామెడీ సీన్స్‌‌కి పడినంత మంచి డైలాగ్స్‌‌ ఎమోషనల్‌‌ సీన్స్‌‌లో పడలేదనిపిస్తుంది. కానీ ఎప్పటిలాగే ఎలాంటి కన్‌‌ఫ్యూజన్‌‌ లేకుండా తన ప్రెజెంటేషన్‌‌లో క్లారిటీ చూపించాడు మారుతి. ఇది తన మార్క్ మూవీ అనిపించేలాగే చేశాడు. ముందుగానే చెప్పుకున్నట్టు ఇంకాస్త ఎమోషన్‌‌ను యాడ్ చేసి ఉంటే మరిన్ని మార్కులు కొట్టేసేవాడు. అయితే ఇలాంటి పాయింట్‌‌ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కావాలని లోపాలు వెతికి తీయకుండా చూడటం అవసరం. అలా చూసుకుంటే మారుతి మంచి సబ్జెక్ట్‌‌తో వచ్చాడని ఒప్పుకుని తీరాలి.